నిర్మల్ అర్బన్, జూన్ 8 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కలెక్టర్లు పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖల అధికారులు శనివారం ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో హాల్ టికెట్ నంబర్లను వేశారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు 71 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 23,504 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష ఉంటుంది. కేంద్రంలో తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
నిర్మల్ జిల్లాలోని గ్రూప్-1 పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరిచాం. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి, జనాలు గుమిగూడకుండా చర్యలు చేపట్టాం. కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
-జానకి షర్మిల, ఎస్పీ, నిర్మల్