బజార్హత్నూర్, జూలై 2 : ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన మూడో విడుత ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ఆరోగ్య పాఠశాలలోని అంశాలపై పాటలు, నృత్యం, నాటిక రూపంలో అవగాహన కల్పించారు. సంబంధిత అధికారులు ఆరోగ్య పాఠశాలలోని ఆరు అంశాలపైన వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల నివారణ, కాలానుగుణ వ్యాధుల నివారణ, వ్యక్తిత్వ వికాసంపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈసారి నిర్మల్ జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీ బాసరకు రికార్డు స్థాయిలో 67 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు.
అనంతరం బోథ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌కు చదువుతోపాటు మంచి ఆరోగ్యం అత్యంత కీలకమని అనంతరం పోషకాహార తోటను ప్రారంభించి, మొకలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్, తహసీల్దార్ శ్యాం సుందర్, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, ఎంఈవో రాంకిషన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, అకాడమిక్ కో-ఆర్డినేటర్లు లక్ష్మణ్, అజయ్, సర్పంచ్ సాయన్న, ప్రిన్సిపాల్ సంగీత పాల్గొన్నారు.