నిర్మల్ అర్బన్ / నిర్మల్ టౌన్, జూలై 28 : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన ఎయిర్ బోట్స్‌పై స్థానిక బంగల్పేట్ వినాయక్‌సాగర్‌లో పోలీసులకు శుక్రవారం శిక్షణ ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండడం, నీటిని దిగువ ప్రాంతాల్లోకి వదలడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటామన్నారు. జిల్లాలోని అన్ని వరద ప్రభావిత ప్రాంతాలకు వేగంగా సహాయక చర్యలు అందించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు.
భైంసా డివిజన్లో ఎక్కువగా రోడ్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా రిస్క్ చేసి వివిధ ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న దాదాపు 60 మందిని రక్షించామని, తమ ప్రాణాలను పణంగా పెట్టి రోప్, లైవ్ జాకెట్‌తో రిస్క్ చేశామని తెలిపారు. తమ వద్ద ఎయిర్ బోట్స్ ఉంటే వరదల్లో చిక్కుకున్న అనేక మందిని సులువుగా కాపాడేవారమని పేర్కొన్నారు. ఇందుకోసం ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్, రోప్స్ వంటి వస్తువులు తెప్పించినట్లు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు, రోప్స్ వంటి వస్తువులను కొనడానికి పోలీస్ శాఖకు సహకారం అందించడంపై కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజలను మరింత సురక్షితంగా, వేగంగా కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ పురుషోత్తం, ఆర్ఐలు రమేశ్, రామకృష్ణ, ఎంపీవో వినోద్, ఆర్ఎస్ఐలు సాయికిరణ్, రవికుమార్, దేవేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.