నర్సాపూర్ (జీ), మార్చి 26 : మండల కేంద్రంలోని శ్రీ అనంత ఆగ్రో రైస్ మిల్లును రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం సీజ్ చేశారు. 2022-2023 ఖరీఫ్, రబీ సీజన్లలో 3,191 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నారు. కొన్ని నెలలుగా ఆగ్రో రైస్ మిల్లు ఉపయోగంలో లేనందున నోటీసులు పంపినా స్పందించకపోవడంతో శ్రీ ఆగ్రో రైస్ మిల్లు వద్దకు అధికారులు వెళ్లారు.
అక్కడ గేట్ తాళాలు వేసి ఉన్నందున యజమానికి సమాచారం ఇచ్చారు. అధికారులు దాదాపు ఒక గంట సేపు వేచి చూశారు. ఫలితం లేక పోవడంతో తాళాలు వేసిన గేట్‌ను పగలగొట్టి పూర్తి వివరాలు తీసుకుని పంచనామా చేశారు. అనంతరం సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, సివిల్ సప్లయ్ అధికారిని ఎన్ఫోర్స్ మెంట్ డీటీ రమాదేవి, ఏఎస్ఐ శంకర్, ఆర్ఐ నవతజ్యోతి, జూనియర్ అసిస్టెంట్ రాజు కుమార్ పాల్గొన్నారు.