
ఆదిలాబాద్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులు వానకాలంలో పత్తి, వరి, కంది, సోయా సాగు చేస్తుండగా.. యాసంగిలో వరి, శనగ, జొన్న వేస్తారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 80 శాతం మంది రైతులు వరిని పండిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపట్టడం, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతో యాసంగిలో వరి విస్తీర్ణం క్రమంగా పెరిగింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయమని చెప్పింది. దీంతో రైతులు నష్టపోకుండా ఈ ఏడాది వానకాలంలో రెండు జిల్లాల్లో పండించిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.1,960 చొప్పున కొనుగోలు చేస్తున్నది. గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నది. దీంతో వానకాలంలో వరి పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. కేంద్రం వడ్ల కొనుగోళ్లకు నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వం వరికి బదులు ఇతర పంటలు వేయాలని రైతులకు సూచించింది.
గ్రామాల్లో విస్తృతంగా అవగాహన
ఈ యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగు విషయంలో వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గతేడాది యాసంగిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,15,918 ఎకరాల్లో వరి సాగవగా.. ఈ సీజన్లో గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పర్యటించి వరికి బదులు ఇతర పంటలు వేయాలని సూచిస్తున్నారు. ఆ పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరిస్తున్నారు. గ్రామాల్లో అధికారులు చెబుతున్న విషయాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇతర పంటలతో ప్రయోజనాలు
ఉమ్మడి జిల్లాలో 5,10,873 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారు. వీటిలో 4,08,112 ఎకరాల నల్లరేగడి నేలలు, 76,302 ఎకరాల ఎర్రనేలలు, 26,259 ఎకరాల ఇసుక, రాతి నేలలు ఉన్నాయి. జిల్లాలోని నేలల్లో యాసంగిలో వరికి బదులు వివిధ పంటలు వేయవచ్చు. నీటి వసతి ఉన్న నల్లరేగడి భూముల్లో శనగ, గోధుమ, పొద్దు తిరుగుడు, ఆముదం, పెసర, మినుము పంటలు.. నీటి వసతి లేని వాటిల్లో శనగ, కుసుమ, ఆవాలు, ఎర్రటి భూముల్లో పల్లికాయ, జొన్నలు, ఉలువలు, ఆముదం, పొద్దు తిరుగుడు, పప్పు ధాన్యాలు, ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంది. రైతులు పంట మార్పిడి చేయకపోవడంతో నేలల్లో భాస్వరం నిల్వలు బాగా పెరిగిపోయాయని అధికారులు అంటున్నారు. సాగు చేసే పంటలకు రసాయన ఎరువుల వాడకం పెరిగినట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలిసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఎకరానికి 177 కిలోల ఎరువులను వినియోగిస్తుండగా.. ఆదిలాబాద్ జిల్లాలో 207 కిలోలు ఇంతకంటే ఎక్కువగా వాడుతున్నారు. యాసంగి సాగయ్యే పంటల్లో తెగుళ్ల నివారణ కోసం పురుగుల మందుల వాడకం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పంటలకు ఎరువుల వాడకం పెరిగితే భూములు క్రమంగా సాగుకు ఏ మాత్రం ఉపయోగపడవని నిపుణులు సూచిస్తున్నారు.