దస్తురాబాద్, జూన్ 8: యాసంగి వరి కోతలు ముగిశాయి. వానకాలం సాగు సన్నద్ధతలో భాగంగా పొలాల్లోని గడ్డికి, వ్యర్థ్యాలకు నిప్పంటిస్తుండడం ప్రమాదాలకు దారి తీస్తోంది. అవగాహన లోపంతో రైతులు కొయ్యలను కాల్చడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. భూసారం దెబ్బతిని దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. పంట భూమిలో వరి కొయ్యలకు నిప్పుపెట్టడం వలన అనేక అనర్థాలు ఉన్నాయి. పొలం మడుల్లో మిగిలిపోయిన వరి కొయ్యలను కలియదున్నడానికి బదులు నిప్పుపెడుతున్నారు. దీంతో పర్యావరణ కలుషితం, నేలను సారవంతం చేసే జీవులు నశించిపోవడం, పంట దిగుబడిలో మార్పు వంటి దుష్ఫరిమాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా భూసారం దెబ్బతింటుంది. నేలను కాపాడుకోవాలంటే వరి కొయ్యలను కాల్చొద్దు .సేంద్రియ ఎరువుగా మలుచుకుంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కలియదున్నడంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఈ సమయంలో రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
పొలాల్లో గడ్డికి నిప్పంటించడం వల్ల భూమి భౌతిక స్థితి దెబ్బతింటుంది. పంట ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడే సేంద్రియ కర్బనం, నత్రజని, సూక్ష్మ పోషకాలు పూర్తిగా నశించిపోతాయి. వరి, పత్తి, మక్క తదితర పంటల కోతల అనంతరం పొలంలో మిగిలిపోయే పంట కొయ్యలను కాల్చడం ద్వారా రైతులు స్వయంగా నష్టపోవడమే కాకుండా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.
పంట వ్యర్థాలు భూమిలో కలియదున్నితే భూమి సారవంతంగా మారుతుంది. చాలా మంది రైతులు వరి పంటను కోసిన తరువాత కొయ్యలను కాల్చివేస్తుంటారు. ఇది పర్యావణం, మానవాళికి అత్యంతమైన ముప్పు. నేల పొరల్లో ఉన్న తేమ శాతం తగ్గి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అత్యంత కీలకమైన సూక్ష్మ జీవరాసులు, శిలీంధ్రాల సంతతి నశింపోతుంది, భూమి సేంద్రియ లక్షణాలు నాశానమవుతాయి.వరి కొయ్యాలను తగలబెట్టకుండా భూమిలోనే కలియదున్నితే వాటిలోని పోషకాలు తిరిగి భూమిలోకి చేరుతాయి.