దండేపల్లి, అక్టోబర్27 : దండారీ వేడుకల్లో భాగంగా ‘రేలారే రేలా’ పాటలపై గుస్సాడీ నృత్యాలతో ఆదివాసీలు హోరెత్తించారు. దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్‌పురి కాకో ఆలయానికి దర్బార్‌కు ఒక రోజు ముందు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీలు ఆలయానికి చేరుకొని సంప్రదాయ బద్ధంగా పూజలు చేశారు. దండారీ ఉత్సవాల్లో భాగంగా రేలా…రేలా…అని పాడుతూ గుస్సాడీ నృత్యాలు చేశారు.
మహిళలు కూడా సంప్రదాయబద్ధంగా నృత్యాలతో సందడి చేశారు. సెలవుదినం కావడంతో భక్తులతో గోదావరి తీరం వద్ద సందడిగా మారింది. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేశారు. పద్మల్‌పురి కాకో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, మేకలు, కోళ్లు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం సమీపంలో వంటలు చేసుకొని సామూహిక భోజనాలు చేశారు. సోమవారం నిర్వహించనున్న గుస్సాడీ దర్బార్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
మోడి గ్రామంలో ఆకట్టుకున్న నృత్యాలు..
కెరమెరి, అక్టోబర్ 27: జైనూర్ మండలం ఆసేపల్లికి చెందిన దండారీ బృందం శనివారం రాత్రి మోడి గ్రామానికి అతిథులుగా వచ్చారు. ఆదివారం ఉదయం వారు సంప్రదాయ వాయిద్యాలతో ప్రదర్శించిన గుస్సాడీ నృత్యాలు, కోలాటాల ప్రదర్శన, హాస్యనాటికలు, జానపద గేయాలు, దేవత ప్రతిమలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను చూసేందుకు పక్క గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
సల్పాల వాగు వద్ద ఘనంగా దర్బార్..
కాసిపేట, అక్టోబర్ 27 : కాసిపేట మండలంలోని దేవాపూర్ సల్పాలవాగు సమీపంలోని ఆదివాసీల ఆరాధ్య దైవం వెంకటాద్రి ఆలయం వద్ద ఆదివారం దండారీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆదివాసీ సంస్కృతిపై గుస్సాడీ, దండారీ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం దండారీ దర్బార్ నిర్వహించి ఆదివాసీ సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ యూనిట్ హెడ్ బాల గిరిధర్, హెచ్ఆర్ హెడ్ కులకర్ణి ఆధ్వర్యంలో భోజన వసతి, ఇతర సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో దండారీ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆడె జంగు, పెంద్రం హన్మంతు, మడావి వెంకటేశ్, మడావి అనంతరావు, ఆత్రం జంగు, వెడ్మ కిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, సొసైటీ మాజీ చైర్మన్ పూస్కూరి వంశీకృష్ణా రావు, నాయకులు, ఆదివాసులు పాల్గొన్నారు.