ఆదిలాబాద్‌లో సంబురాల్లో భాగంగా ఎమ్మెల్యే జోగు రామన్నను ఎత్తుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ‘జై తెలంగాణ.. జై జై భారత్.. జై టీఆర్ఎస్.. జై జై కేసీఆర్..’ నినాదాలు మారుమోగాయి. గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పటాకులు కాల్చారు.. మిఠాయిలు పంచుకున్నారు. బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేక్‌లు కట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఖానాపూర్‌లో రేఖానాయక్, ముథోల్‌లో విఠల్‌రెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు సంబురాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు.. పార్టీ గెలుపునకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు తమ వంతు కృషి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మునుగోడు ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని, సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో టీఆర్ఎస్కు పట్టం కట్టారని పేర్కొన్నారు.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆసిఫాబాద్, నవంబర్ 6 : బీజేపీకి తగిన గుణపాఠం చెబుతూ.. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీకి పట్టం కట్టారు. బీజేపీ చేసిన కుట్రలను.. స్వార్థ ప్రయోజనాల కోసం రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి డ్రామాలను ఓటెత్తి తిప్పికొట్టారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రకటించిన కేంద్ర మంత్రి అమిత్‌షాకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ వెంటే ఉంటామని.. కేసీఆర్ వెనుకే నడుస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించాక జరిగిన తొలి ఎన్నికల్లోనే గెలుపొందడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
మునుగోడులో విజయం సాధించడంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకుల సంబురాలు అంబరాన్ని అంటాయి. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్..నినాదాలు మిన్నంటాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రాలతోపాటు లక్షెట్టిపేట, దండేపల్లి, రామకృష్ణాపూర్, హాజీపూర్, సీసీసీ నస్పూర్, కోటపల్లి, జైపూర్, భీమారం, మందమర్రి, కన్నెపల్లి, కాసిపేటలోని పలు చోట్ల టీఆర్ఎస్ విజయోత్సవ సంబురాలు జరిగాయి. పార్టీ నాయకులు పటాకులు కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు.
మంచిర్యాలటౌన్ : మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యకు మిఠాయి తినిపిస్తున్న టీ(బీ)ఆర్ఎస్ నాయకులు
ఆసిఫాబాద్ : కోవలక్ష్మి నివాసం వద్ద నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి నివాసం వద్ద టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చారు. కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు నృత్యాలు చేశారు. రెబ్బెనలోని గోలేటి టౌన్షిప్లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణారావు, కోనేరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ, టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తాలో పటాకులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. కెరమెరి, జైనూర్, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లోని గ్రామాల్లో సంబురాలు చేసుకున్నారు.
మన ఎమ్మెల్యేల ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ తరఫున ఇన్చార్జిలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. మునుగోడులోని చండూరు, చౌటుప్పల్ మున్సిపల్ వార్డులు సహా చండూరు, చౌటుప్పల్, మర్రిగూడ, నాంపల్లి, నారాయణపూర్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో మన నాయకులు ప్రచారం నిర్వహించారు. సుమారు నెల రోజుల పాటు అక్కడే ఉండి ఓటర్లను నేరుగా కలిసి పార్టీ తరఫున ప్రచారం చేయడం సత్ఫలితాలు ఇచ్చింది. మన నాయకులు ప్రచారం చేసిన ప్రాంతాల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీకే మెజార్టీ ఓట్లు పడ్డాయి.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి నారాయణపూర్ మండలం సర్వెల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 1, వార్డు నంబర్ 9, చండూరు మండలం తీరట్పల్లి, శేరిగూడెం, ఖమ్మగూడెం గ్రామాలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మర్రిగూడ మండలం తిరుగాండ్లపల్లి గ్రామానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, అంతపేట గ్రామానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నాంపల్లి మండలం బీటీపురం, తుమ్మలపల్లి, రెవల్లి, ఫకీర్‌పురం, సుంఖిశాల గ్రామాలకు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇన్చార్జిలుగా పని చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ గెలుపునకు తమ వంతు కృషి చేశారు.