ఆదిలాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో అధికారులు భద్రతను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. రిమ్స్ వైద్యశాలతోపాటు సూపర్ స్పెషాలిటీ, మె డికల్ కళాశాలలో వైద్యులు, రెసిడెంట్ డాక్టర్లు, పీజీ వి ద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు కలిపి 2500 మంది వరకు ఉంటారు. విద్యార్థులు, హాస్టల్లో ఉంటూ విద్య ను అభ్యసిస్తారు. రిమ్స్‌లో వివిధ విభాగాల్లో కూడా వి ద్యార్థులు విధులు నిర్వహిస్తుంటారు. ఉదయం, మధ్యా హ్నం, రాత్రి సమయాల్లో వైద్యశాలలో వైద్యులు, విద్యార్థులు వైద్యసేవలు అందిస్తారు. రిమ్స్‌కు వైద్యం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలతోపాటు మహారాష్ట్రవాసులు వస్తుంటారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో కొన్ని రోజులుగా ఆసుపత్రిలో 2 వేల వరకు ఓపీ, 800 వరకు ఐపీ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.
రిమ్స్ వైద్యశాలలోని వివిధ విభాగాలతోపాటు కళాశాల, హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఉండగా 120 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది వివిధ షిప్టుల్లో విధులు నిర్వహిస్తారు. వైద్యశాల, కళాశాలలో భద్రతో కోసం పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ గౌష్ ఆలం గురువారం రిమ్స్ భద్రత చర్యలను పరిశీలించారు. వైద్య కళాశాల, హాస్టల్ భవనాలతోపాటు, సీసీ కెమెరాల పనితీరు, ప్రైవేటు భద్రత సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు భద్రత సిబ్బందికి సూచనలు చేశారు. విద్యార్థుల భద్రతలో భాగంగా స్పెషల్ హాస్టల్ సెక్యూరిటీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో పోలీసు అధికారులతోపాటు మెడికల్ కళాశాల, వైద్యశాల అధికారులు, వైద్యులు ఉంటారని తెలిపారు. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ పెంచనున్నట్లు తెలిపారు. ఏమైన ఘటనలు జరిగినప్పుడు వైద్యులపై దాడులు, ఇతర గొడవలు జరుగకుండా ఎలా వ్యవహరించాలనే విషయంలో రిమ్స్ భద్రత సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలోని పోలీస్ అవుట్లో సిబ్బందిని అదనంగా నియమించడంతోపాటు ల్యాండ్ ఫోన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఘటనలు జరిగినా ప్రైవేటు భద్రత సిబ్బంది పోలీసు అవుట్‌పోస్టులో సమాచారం ఇవ్వాలని సూచించారు. వైద్యుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.