నిర్మల్ టౌన్, మార్చి 27 :తెలంగాణ-మహారాష్ట్రవాసుల ‘బంధం’ విడదీయలేనిది. సరిహద్దులు కలిసి ఉండడం, భాషాపరంగా ఇబ్బంది లేకపోవడం, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు దగ్గరగా ఉండడంతో రెండు దశాబ్దాలుగా వివాహ సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. యేడాదికి దాదాపు వంద వరకు పెండ్లిళ్లు జరిగేవి. స్వరాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటుతోపాటు కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, పింఛన్, కేసీఆర్ కిట్, మహిళలకు రుణాలు, విద్యా పథకాలకు మహారాష్ట్రవాసులు ఆకర్షితులవుతున్నారు. తెలంగాణవాసులకు తమ బిడ్డలను ఇస్తే సుఖంగా ఉంటారనే భావనతో పెండ్లిళ్లు చేస్తున్నారు. ఈ ఏడున్నరేండ్ల కాలంలో యేడాదికి 300లకుపైగా దాదాపు 2,200 జంటలు ఏకమయ్యాయి. మన వారు కూడా మహారాష్ట్ర ఆడబిడ్డలు మర్యాదగా ఉంటారనే భావనతో సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుగా 70 శాతానికి పైగా మహారాష్ట్ర విస్తరించి ఉంటుంది. ప్రధానంగా మహారాష్ట్రలోని నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్ జిల్లాల్లోని ధర్మాబాద్, బిలోలి, ఉమ్రి, బోకర్, కిన్వట్, గడ్చిరోలి తాలూకాలు ఆనుకొని ఉంటాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోనూ ఆరె, లింగాయత్, వాణి, ముస్లిం, లంబాడీ, మర్వాడీ, రాజపుత్ర, మున్నూరు కాపు సామాజిక వర్గాలవారు అధికంగా ఉంటారు. రెండు ప్రాంతాల్లోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఒకే మాదిరిగా ఉంటాయి. దీనికి తోడు భాషాపరంగా కూడా ఇబ్బంది లేకపోవడంతో ఇరుప్రాంతాల వారు 20 ఏండ్లుగా పెండ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యేడాదికి దాదాపు 100 వరకు పెండ్లిళ్లు జరుగగా.. స్వరాష్ట్రంలో యేడాదికి 250-300 వరకు వివాహాలు జరుగుతున్నాయి.
పెండ్లిళ్ల సంఖ్య పెరగడానికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమని మహారాష్ట్రవాసులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు వంటివాటితోపాటు కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్, మహిళలకు రుణాలు, కార్పొరేట్ స్థాయి విద్యాలయాలు నెలకొల్పి విద్య అందించడం వంటి వాటితో ఆకర్షితులవుతున్నారు. మా బిడ్డ సుఖంగా బతుకుతుందనే ఆశతో అధికంగా తెలంగాణ ప్రాంతవాసులకు ఇచ్చి పెండ్లి చేస్తున్నారు. మన వారు కూడా మహారాష్ట్ర ఆడబిడ్డలు కుటుంబాన్ని, పెద్దలను గౌరవించడం, అణుకువగా ఉండడం, చెప్పినట్లు వినడం, పని అధికంగా చేస్తారనే భావనతో సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.
ఇద్దరు బిడ్డలు తెలంగాణలనే..
నా పేరు శివరాజ్. నేను నా భార్య సాగరబాయి కలిసి మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా నల్లగొండ తండాలో ఉంటం. మాకు మమత, సుజాత ఇద్దరు కూతుళ్లు, రాజేందర్, మహేశ్ యోగేశ్ కుమారులు ఉన్నారు. మా ఊరు నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటది. మాకు నల్లగొండ తండాలోనే తరాలుగా వస్తున్న ఐదెకరాల భూమి ఉంది. నేను 30 ఏండ్లుగా ఎవుసం చేస్తున్న. బోర్లు వేసినా నీళ్లు పడవు. వర్షం పడితేనే పంట పండుతది. వానకాలంలో మాత్రమే పత్తి, జొన్న వేస్తం. ఆ వర్షాలు కూడా పడకపోతే రెక్కల కష్టం మిగలదు. తెలంగాణ సర్కారోళ్లు ఇస్తున్నట్లుగా మా దగ్గర వ్యవసాయ, సంక్షేమ, విద్యా పథకాలు సక్రమంగా లేవు. పింఛన్ రాదు, దవాఖానలు సరిగ్గా లేవు. మా పిల్లల్ని తెలంగాణ బడు ల్లోనే చదివించినా. బిడ్డలను తెలంగాణకు ఇస్తే ఆనందంగా ఉంటుందని నా భార్యతో విచారించినా. మా పెద్ద బిడ్డ మమతను 2015లో ముథోల్ మండలంలోని విట్లోలికి చెందిన అభినవ్‌కు, చిన్న బిడ్డ సుజాతను బోథ్ మండలంలోని మర్లపల్లికి చెందిన గంగాధర్‌కు 2016లో ఇచ్చి పెండ్లి చేసిన. మా అల్లుళ్లకు కొంత భూమి ఉంది. బోర్లు పడ్డయ్. ఉచితంగా కరంటు, రైతుబీమా, రైతుబంధు అందుతున్నది. మా బిడ్డ బీడీలు చుడుతున్నది. నెలకు రూ.5వేలు సంపాదిస్తున్నది. పింఛన్ కూడా వస్తున్నది. మా మహారాష్ట్రలో అయితే రూపాయి కూడా రాదు. మా భాషతో కూడా ఇబ్బంది లేదు.
నా బిడ్డకు అన్ని పథకాలు వస్తవి..
నా పేరు అశోక్. నా భార్య పేరు సంగీత. మాది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూరు తాలూకా కేంద్రం. మాకు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు పండకపోవడంతో బంగారం వ్యాపారంపై దృష్టిపెట్టా. ఒక కొడుకు, ఒక బిడ్డ ఐశ్వర్య ఉన్నారు. ఇద్దరినీ బాగా చదివించా. మా అమ్మాయిని తెలంగాణ అబ్బాయికి ఇస్తే బాగుంటుందని సంబంధాలు చూసిన. అక్కడ ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయని భావించా. నేను అనుకున్నట్టుగానే ముథోల్ మండలం వడ్తాల్ గ్రామానికి చెందిన కామన్నపటేల్ కుమారుడు ఆకాశ్‌తో 2021లో పెండ్లి చేసిన. వీరికి 30 ఎకరాల భూమి ఉంది. పుష్కలంగా నీళ్లు ఉండడంతో పంటలు బాగా పండిస్తున్నరు. నా బిడ్డకు తెలుగు రావడంతో అత్తామామ, భర్త, ఇరుగుపొరుగు వారితో సంతోషంగా ఉంటున్నది. నాకు తెలిసిన వారికి కూడా తెలంగాణ అబ్బాయికే ఇవ్వమని చెబుతున్న. నా బిడ్డకు అన్ని పథకాలు వర్తిస్తున్నవి.
మా ఊరి నుంచే 25 మందిని ఇచ్చినం..
మా గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉంటది. నేను ఐదేళ్లుగా సర్పంచ్‌గా పనిచేస్తున్న. మా గ్రామానికి తెలంగాణ జిల్లాలోని కుభీర్ మండలం సిరిపెల్లి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. తెలంగాణ సరిహద్దు వరకు పంట పొలాలు పచ్చగా ఉంటయి. మా సరిహద్దులకు వస్తే బీడు భూములు కనిపిస్తయ్. అందుకే మా ఊరిలో చాలా మంది ఆడబిడ్డలను తెలంగాణ మగపిల్లలతోనే సంబంధాలు కలుపుకుంటున్నరు. మా ఊరిలోనే 25 మంది వరకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెండ్లి చేసుకున్నరు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధాలు బాగా పెరిగినయ్. దీనికి ప్రధాన కారణం తెలంగాణల ప్రజలు, ఆడపిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలే.
– సుదర్శన్ రామారావు, చెట్లవార్, సర్పంచ్, పాలజ్, బోకర్ తాలూకా, నాందేడ్ జిల్లా.
ముగ్గురు బిడ్డలను తెలంగాణకే ఇచ్చిండు..
పై చిత్రంలో కనిపిస్తున్న వారు.. కవిత-సంతోష్, గీత-శ్రీనివాస్, అనిత-గణేశ్, సవిత-చంద్రకాంత్ దంపతులు. వీరందరూ కదం దిగంబర్-కమలాబాయి కూతుళ్లు, అల్లుళ్లు. వీరిది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకా నయగాం. ఇది నిర్మల్ జిల్లా బాసరకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. దిగంబర్‌కు ఐదెకరాలు ఉండగా.. నీటి తడులు లేకపోవడంతో యేడాదికి ఒకే పంట వేసేవాడు. ఇంటిల్లిపాది పనిచేసినా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండేది. మహారాష్ట్రలో వ్యవసాయ పథకాలు నామ మాత్రంగా ఉండడం, తెలంగాణలో రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరంటు, సబ్సిడీపై పథకాల గురించి తెలుసుకున్నాడు.
భూమి ఉండి లాభం లేదని, తనలా తన కూతుళ్లు ఇబ్బంది పడొద్దని తెలంగాణ అబ్బాయిలకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముగ్గురికి తెలంగాణ సంబంధాలు కుదుర్చుకొని వివాహం చేయగా.. చిన్న కూతురుకు సంబంధం దొరుకక పోవడంతో మహా రాష్ట్రలోనే ఇచ్చాడు. పెద్ద కూతురు కవితను 2014లో కుంటాల మండలం ఓలకు చెందిన సంతోష్‌కు, రెండో కూతురు గీతను 2016లో ముథోల్ మండలం కనకాపూర్‌కు చెందిన శ్రీనివాస్, మూడో కూతురు అనితను 2018లో భైంసా పట్టణానికి చెందిన గణేశ్‌కు ఇచ్చి పెండ్లి చేశాడు. ముగ్గురు అల్లుళ్లు వ్యవసాయం, వ్యాపారం చేస్తుండగా.. ముగ్గురు కూతుళ్లు బీడీలు చుడుతూ పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నారని దిగంబర్ తెలిపాడు.