ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 8 : బాల్యం నుంచే సైన్స్‌పై మక్కువ పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మేళాను ఎమ్మెల్యే రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మేళాలు విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాయన్నారు.
తల్లిదండ్రులు కూడా పిల్లల సృజనాత్మకతను గమనిస్తూ ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నదన్నారు. ప్రపంచ దేశాలు సైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్నారని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ గుర్తు చేశారు. విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞాన శాస్త్రం, ప్రయోగాలపై శ్రద్ధ చూపుతూ రాణించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసి న ఎగ్జిబిట్లను తిలకించారు. వాటి పనితీరును అడి గి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మ న్ అడ్డి భోజారెడ్డి,అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, డీఈవో ప్రణీత, శిక్షణ కలెక్టర్ శ్రీజ, జిల్లా సైన్స్ అధికారి రఘు రమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పాల్గొన్నారు.
ఆటోమెటిక్ ఆన్ఆఫ్ స్ట్రీట్ లైట్స్
గ్రామాలు,పట్టణాల్లోని పలుచోట్ల పగలు కూడా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటాయి. తెలవారగానే వీధి దీపాలు ఆరిపోయేలా ఆటోమెటిక్ స్విచ్ ప్రయోగాన్ని తీసుకువచ్చాం. ఈ చిన్న యంత్రా లను స్ట్రీట్ లైట్ల వద్ద అమరిస్తే అవి తెల్లవారుజామున ఆఫ్ అవుతాయి. తర్వాత రాత్రికి బల్బులు వెలుగుతాయి. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది. సమాజానికి, ప్రభుత్వానికి ఉపయోగం.
షేక్ సర్ఫరాజ్, గజిటెడ్ నెంబర్.1 పాఠశాల ఆదిలాబాద్
బ్లూ ప్లాస్టిక్ రోడ్డుతో ప్రయోజనం
ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిం టున్నది. అలా కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొని రోడ్డుగా వేసుకుంటే ప్రయోజకరంగా ఉంటుంది. అయితే నలుపు రంగులో కాకుండా పర్యావరణహితానికి బ్లూ కలర్లో రోడ్డును వాడుకుంటే, సమాజానికి మరింత ఉపయోగంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో రోడ్డు అవుతుంది. నీలిరంగు ఆపాదించడంతో చల్లదనంగా ఉంటుంది.
గౌరీ కీర్తన, మనోజ్ఞ, 9వ తరగతి లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆదిలాబాద్
ఎక్కువ డివైస్‌లకు దాటా ట్రాన్స్ఫర్
మేము రూపొందించిన పరికరం పేరు లై ఫై ఫోన్ ద్వారా ఎక్కువ సంఖ్యలో డివైస్‌లకు వివిధ రకాల డాటాను దీంతో చేరవేయొచ్చు. ఈ పద్ధతి వాస్తవానికి ఇతర దేశాల్లో ఉంది. ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్, రెండు లేదా ఎక్కువ సంఖ్యలో డివైస్‌లకు అనుసంధానం చేసి డాటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ పద్ధతితో తొందరగా వేగంగా తక్కువ ఖర్చుతో డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది.
శ్రీహిత, సమీక్ష, శ్రీ చైతన్య పాఠశాల ఆదిలాబాద్
ఆత్మహత్యలను నివారించవచ్చు
వివిధ కారణాలు, ఒత్తిళ్లతో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానంగా ఒక వ్యక్తి ఫ్యానుకు ఉరి వేసుకున్న కూడా మేము చేసిన ప్రయోగంతో కిందికి వచ్చేస్తాడు. ప్రాణాలు పోకుండా, ఈ ఫ్యానుకు అమర్చిన స్ప్రింగ్ కాపాడుతుంది. ఫ్యాన్ కొన్నప్పుడు సెన్సార్ బిగిం చడంతో వాటికి మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయడం ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు ఫోన్‌కు సమాచారం అందుతుంది. దీంతో బంధు వులు అప్రమత్తమై కాపాడే అవకాశం ఉంటుంది. ఈ రకం ఫ్యాన్లు మార్కెట్లోకి వస్తే బాగుంటుంది. చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చు.
-వైష్ణవి, నిహారిక, 9వ తరగతి జడ్పీఎస్ఎస్, ఇచ్చోడ
శాటిలైట్‌తో కమ్యూనికేషన్
శాటిలైట్ ద్వారా భూమికి కమ్యూనికేషన్ ఎలా వస్తుందనే విషయం అందరికీ తెలియ జేయడానికి ఈ ప్రయోగం రూపొందిం చాం. మనం టీవీ చూస్తున్నా, ఫోన్ వాడుతున్నా విమానంలో ప్రయాణిస్తున్నా, సముద్ర మార్గం లో వెళ్తున్నా శాటిలైట్ వ్యవస్థనే అన్నింటికీ మూలం. శాటిలైట్ వ్యవస్థ ఈ కమ్యూనికేషన్ ప్రగతిబాటలో ఉంటుంది. ఈ వ్యవస్థ గురించి అందరికీ తెలియడానికి వివరంగా ప్రయోగం ద్వారా చెబుతున్నాం.
రత్నం నిరీక్షణ, జడ్పీఎస్ఎస్ ఇంద్రవెల్లి