ఆదిలాబాద్, అక్టోబర్ 1 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లో ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో బీడీఎన్టీ ఐటీ కంపెనీ ఆధ్వర్యంలో సీఐఐ తెలంగాణ రోడ్‌షోలో భాగంగా యువత, పారిశ్రామిత వేత్తల అవగాహన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పది సంవత్సరాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నదని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత నూతన ఆవిష్కరణల ద్వారా పారిశ్రామితవేత్తలుగా ఎదుగాలని ఆకాంక్షించారు. జిల్లాలో రైతులు పత్తిపంటను ఎక్కువగా పండిస్తున్నందున ఆదిలాబాద్‌లో టైక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని గుర్తు చేశారు.
జిల్లాలో రెండు ఐటీ కంపెనీలు పనిచేస్తుండగా 230 మంది ఇంజినీర్లు, ఇతరులు ఉద్యోగాలు చేస్తూ భారీ వేతనాలు పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులు కొనసాగుతున్నాయని, వీటిల్లో వేయి మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. జిల్లాలో తెలుగు మీడియం విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంటు పరిశ్రమను పునఃప్రారంభించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. ఆదిలాబాద్ సీసీఐ ప్రారంభమైతే 5 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐని తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని సూచించినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతో జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు పెరగడానికి పారిశ్రామీకరణ అవసరమని పేర్కొన్నారు. వ్యవసాయం, పోల్ట్రీ, పాడి పరిశ్రమ రంగాల్లో యువతకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకంలో భాగంగా డిమాండ్ ఉన్న స్కీంలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సదస్సులు పారిశ్రామిక వేత్తలు, యువతకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్మన్ శేఖర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, బీడీఎన్టీ ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ దేశ్‌పాండే, పారిశ్రామికవేత్తలు, యువత పాల్గొన్నారు.
బీజేపీ పాలనలో ప్రజలకు ఇబ్బందులు
ఎదులాపురం,అక్టోబర్1: దేశంలో బీజేపీ పాలనలో అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకాగా పెద్ద ఎత్తున హమాలీ వర్కర్లు ,కార్మికులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించగా. జై తెలంగాణ ..జై జోగు రామన్న నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తుంటే కొందరు నేతలు కుక్కర్లను పంచుతూ రాజకీయలబ్ధి కోసం ప్రయత్నిస్తుండడం హాస్యాస్పదమన్నారు. సామాన్యులకు ఆసరాగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికే ప్రజలు మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లలోనే తెలంగాణ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోందని ధ్వజమెత్తారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయన్నారు. గతంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నదని మండిపడ్డారు.
రక్తదానానికి ముందుకు రావాలి
రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందగా ముందుకు రావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారిని అభినందించి పండ్ల రసం అందజేశారు. అనంతరం రక్తదానం చేసిన పలువురిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ విషయాన్ని గుర్తించి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. యువత సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మాల సంక్షేమ సంఘ భవనం ప్రారంభం
అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ సమగ్ర అభ్యున్నతికి ప్రభుత్వం పాటు పడుతోందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్మించిన మాల సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భవన నిర్మాణానికి పాటు పడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మాలల సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. జైనథ్లోనూ మాల సంక్షేమ భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన అర్హులైన దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎస్సీ స్డడీ సర్కిల్ కోసం రెండెకరాల భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్, రిమ్స్ డైరెక్టర్ చైర్మన్ జైసింగ్ రాథోడ్, రాష్ట్ర మాల మహానాడు జేఏసీ కన్వీనర్ చెరుకు రాంచందర్, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లూరి భూమన్న, దాసరి బాబన్న, మావల జడ్పీటీసీ నల్ల వనితారాజేశ్వర్, మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్ బండారి సతీశ్, సాజిదొద్దీన్, అష్రాఫ్, నయీం, మహేందర్, ఎజాజ్, సలీం, కుమ్ర రాజు, సలీంపాషా, సేవా ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.