ఆదిలాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుర్నీతిని ఎండగడతూ జైనథ్, మావల మండలాల్లో తీర్మానాలు చేశారు. మావలలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే జోగు రామన్న ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్తేజపర్చారు. కాంగ్రెస్ పాలనలో కష్టాలు అనుభవించిన తాము ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటుతో రెండు పంటలు వేస్తూ లాభాలు పొందుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలం సిర్సన్న, డొల్లార, మావల మండలం కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతుల సమావేశమై కాంగ్రెస్ నాయకుల కుట్రలను ఎండగట్టారు. కాంగ్రెస్ కటిక చీకట్ల కాలం వద్దు, 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ పాలన ముద్దు.. మాడు గంటల వ్యవహారం వద్దు, మూడు పంటల విధానం కావాలి.. రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ తీర్మానాలు చేశారు.
కాంగ్రెస్ నాయకులవి పగటికలలు
కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో అధికారంలోకి రావాలనే పగటి కలలు మానుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. జైనథ్ మండలం సిర్సన్న, డొల్లార, మావల మండలాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వ్యవసాయ విద్యుత్‌పై వారి విధానాన్ని తెలియజేయాలని నిలదీయాలని సూచించారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసనగా రైతులు ఆందోళనలు చేస్తున్న బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల బావుల వద్ద మీటర్ల పెడుతూ వారిపై ఆర్థిక భారం మోపాలని చూస్తుందన్నారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బీజేపీలో దొందు దొందేనని, కాంగ్రెస్‌కు బీజేపీ బీ టీంగా వ్యవహిస్తుందని తెలిపారు. మావల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాయల చైర్మన్ రౌతు మనోహర్, జడ్పీటీసీ వనిత, ఎంపీపీ సంగీత, నాయకులు మెట్టు ప్రహ్లాద్, రాజేశ్వర్, రాజన్న, ఆసిఫ్‌ఖాన్, ఏవన్లు పాల్గొన్నారు.
రైతులకు క్షమాపణ చెప్పాలి
రైతులు బాగుపడితే చూడలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలోని సిర్సన్న, పిప్పర్వాడ, గిమ్మ గ్రామాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన రైతు సభలకు ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మూడు గంటలు చాలని ఆనడం ఎంత వరకు సమంజసమన్నారు. రేవంత్ తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నదన్నారు. దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు దొందూ దొందే అని ఎమ్మెల్యే గుర్తు చేశారు . కాంగ్రెస్, బీజేపీలు అబద్ధాలు ఆడడంలో పీహెచ్డీ పట్టాను పొందాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులు, ప్రతిపక్షాల అర్థంలేని ఆరోపణలు గురించి ప్రజలు నిరంతరం చర్చ జరపాలని సూచించారు. రైతు వ్యతిరేక పార్టీలు గ్రామాల్లో తిరిగితే అడ్డుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని తీర్మానం ఆమోదించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్ ,రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, ఎంపీపీ గోవర్ధన్, వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్ , బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి , రైతు బంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పురుషోత్తం యాదవ్, రైతు బంధు సమితి డైరెక్టర్ చంద్రయ్య, సర్పంచ్‌లు మద్దుల ఊశన్న, సంతోష్‌రెడ్డి, కోల సుమ, ఎంపీటీసీలు భోజన్న, ప్రశాంత్‌రెడ్డి, గ్రామాల రైతులు పాల్గొన్నారు.