ఉట్నూర్, నవంబర్ 5 ః గిరిజనులలో సహజ సిద్ధమైన క్రీడాబలం ఉంటుందని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. మంగళవారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో ఐదవ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలను ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్ జాదవ్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు ప్రకృతిలో జీవిస్తారని అందుకే వారికి సహజ సిద్ధమైన బలం ఉంటుందన్నారు. దానికి తోడ్పాటు అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో 47 మంది క్రీడాకారులు పథకాలు సాధించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఏజెన్సీలో జాతర్ల, ఉట్నూర్ క్రీడా పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశానన్నారు. ఇటీవల జాతీయస్థాయిలో క్రీడలకు సంబంధించిన కమిటీలో తనకు సభ్యత్యం ఉందని దానిని ఉపయోగించుకుని మరిన్ని ఏర్పాట్లు చేసే అవకాశాలు పరిశీలిస్తానన్నారు. క్రీడాకారులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడితే విజయాలు సాధిస్తారన్నారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏజెన్సీలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు అధికారులు ప్రపోజల్స్ పంపాలన్నారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ఉద్యోగాలు సాధించేందుకు రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. తాము చదువుకునే సమయంలో తిండికి కష్టంగా ఉండేదని పేర్కొన్నారు. కానీ.. నేటి ప్రభుత్వాలు క్రీడాకారులకు మంచి పౌష్టికాహారంతోపాటు షూ వరకు అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సభ్యురాలు ఈశ్వరీబాయి, ఏపీవో వసంత్‌రావు, డీడీ చందన, ఉట్నూర్ డీఎస్పీ నగేందర్ గౌడ్, జిల్లా క్రీడాధికారులు పార్థసారథి, రమేశ్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.