నిర్మల్, మే 22(నమస్తే తెలంగాణ) : వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. రెండు రోజుల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ప్రధాన రహదారులు రైతుల రాస్తారోకోలతో రణరంగంగా మారాయి. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్-నిర్మల్ ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
పక్షం రోజులుగా ధాన్యాన్ని అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని, కొనుగోళ్లలో జరిగిన జప్యంతో ధాన్యం తడిసిపోయిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. అలాగే నర్సాపూర్(జి) మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భైంసా-నిర్మల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దాదాపు రెండు గంటలపాటు నిరసనకు దిగడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఖానాపూర్ మండలంలోని సత్తనపెల్లి ప్రధాన రహదారిపై గోడలపంపు, బీర్నంది, కొత్తపేట గ్రామాలకు చెందిన రైతులు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అలాగే కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ ఎల్లాపూర్ గ్రామం వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. లింగాపూర్ కొనుగోలు కేంద్రంలో కుప్పలు తెప్పలుగా వడ్ల రాశులు ఉన్నాయని, కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్‌లో రైతులు చేస్తున్న ఆందోళన విషయాన్ని తెలుసుకుని వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనతో వాగ్వాదానికి దిగారు. కొద్దిరోజులుగా ఇక్కడ ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో తామంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని, తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పలువురు రైతులు ఆయనపై మండిపడ్డారు. ఈ క్రమంలో కొంత అసహనానికి గురైన ఎమ్మెల్యే తాను ఇక్కడికి వస్తున్న సమాచారాన్ని తెలుసుకుని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారన్నారు.
మీరంతా అసలైన రైతులైతే ఆందోళన చేయరని, మీ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారంటూ ఎమ్మెల్యే అనడంతో అక్కడున్న రైతులంతా ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎవరూ రెచ్చగొట్టలేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతూ పార్టీలకతీతంగా రైతులమంతా కలిసి ఆందోళన చేపడుతున్నామన్నారు. ఒక దశలో అటు ఎమ్మెల్యే అనుచరులు, ఇటు రైతులు దూషణకు దిగారు. ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకున్నది. ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమనిగింది.
వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా రైతుల పక్షాన పోరాడుతామని పలువురు బీఆర్ఎస్ నాయకులు అన్నదాతలకు భరోసా కల్పించారు. గురువారం నిర్మల్ మండలంలోని మంజులాపూర్, చిట్యాల్ తదితర గ్రామాల్లోని కొనుగోలు సెంటర్లను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సుభాష్‌రావు, మారుగొండ రాము సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.
సుభాష్‌రావు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేవరకు వారికి అండగా ఉంటామన్నారు. తేమ శాతాన్ని పట్టించుకోకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.