ఎదులాపురం, ఫిబ్రవరి 13 : కుష్టు వ్యాధి నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో కుష్టు నివారణ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీఎంహెచ్వో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కుష్టు నివారణకు ప్రతి ఒకరు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు ఉంటే కుష్టు వ్యాధిగా అనుమానించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షించుకోవాలని సూచించారు. బహుళ ఔషధ చికిత్సతో ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
2027 నాటికి భారతదేశాన్ని కుష్టురహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సర్వేలతోపాటు పక్షోత్సవాలను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్రాజ్, అంకోలి పీహెచ్సీ వైద్యులు డాక్టర్ సర్ఫరాజ్, డీపీఎంవోలు రమేశ్, వామన్రావు, ఆరోగ్య పర్యవేక్షులు సుభాష్, సురేశ్, ప్రిన్సిపాల్ గోపాల కిషన్, ఎంఎల్హెచ్పీ శిరీష పాల్గొన్నారు.