ఎదులాపురం,సెప్టెంబర్ 5 : ఆదిలాబాద్ పట్టణలో శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవానికి 600 మంది పోలీసులు, 350 సీసీ, డ్రోన్ కెమెరాలతో పటిష్ట పొలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో 8 క్లస్టర్లు ఎనిమిది సెక్టార్లుగా విభజించి అడుగడుగునా పోలీసు సిబ్బందిని బందోబస్తులో ఉంచినట్లు తెలిపారు. 23 సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సీఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి రెండు స్రె్టైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేసి 15 మంది పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వివరించారు. సెక్టర్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తారని తెలిపారు. 15 మంది కెమెరామెన్లు, డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆకతాయిలు, ప్రజలను రెచ్చగొట్టే వారిపై ప్రత్యేకంగా రెండు బృందాలను మఫ్టీలో ఉంచి నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
20 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విధులను నిర్వరిస్తున్నారని వెల్లడించారు. రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని, కళ్లకు హాని చేసే లేజర్ లైట్లు, పేపర్ స్ప్రే యంత్రాలకు అనుమతులు లేవని తెలిపారు. వేడుకలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
శాంతి భ్రద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. పెన్‌గంగా, చాంద (టీ)లోని నిమజ్జన ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనతో పాటు 15 మంది సీఐలు, నలుగురు డీఎస్పీలో, ఇద్దరు ఏఎస్పీలు బందోబస్తును పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సరిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు..
ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర వెళ్లే రూట్లలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లకు అనుమతి లేదని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రధాన కూడళ్లు ప్రజలతో కికిరిసిపోయి ఉన్నందున పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు.
పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా 50 మంది ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 24 గంటలు విధులు నిర్వహిస్తారని తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు అయిన అంబేదర్ చౌక్, గాంధీ చౌక్, వినాయక చౌక్, దేవి చంద్ర చౌక్, నేతాజీ చౌక్, ఎంజీ రోడ్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు కార్లకు అనుమతి లేదని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో పాత జాతీయ రహదారిని వాడుకోవాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.