ఎదులాపురం, డిసెంబర్ 27 : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ఆర్థిక సహాయం పేరిట మోసాలకు పాల్పడుతున్న మహమ్మద్ ఫారూఖ్ అలియాస్ ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరా ప్రకారం.. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌కు చెందిన ఫారూఖ్‌పై డిసెంబర్ నెలలో ఆదిలాబాద్ జిల్లా కైలాస్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అఖీల్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది.
ఈనెల 7న మహమ్మద్ ఫారూఖ్ వాట్సాప్ కాల్ చేసి అహ్మద్ అన్న అస్లాం మౌలానాకు శ్రేయోభిలాషినని చెప్పాడు. రూ.లక్ష ఆర్థిక సహాయం పంపిస్తానని నమ్మబలికాడు. నమ్మకం కలిగించేందుకు నకిలీ ట్రాన్స్జక్షన్ స్రీన్ షాట్లు పంపి, వివిధ కారణాలు చెప్పి తిరిగి చిన్న మొత్తాలు పంపించమని కోరాడు. దీంతో అహ్మద్ రూ.58,500లను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేయగా, మోసానికి గురైనట్టు గ్రహించాడు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి ఆదిలాబాద్ ఐటీ సెల్ సాంకేతిక సహకారంతో బ్యాంక్ రికార్డులు, వాట్సాప్, గూగుల్ డేట, ఐపీ అడ్రసులు, ఐఎంఈఐ వివరాలు సేకరించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 26న ఉదయం మావల మండలంలోని రాంనగర్లో ఫారూఖ్‌ను పట్టుకున్నారు. విచారణలో నిందితుడు నేరాలను అంగీకరించగా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ర్టాల్లో మొత్తం 37 సైబర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు వెల్లడైంది. సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 15 రోజుల న్యాయ రిమాండ్ విధించారు. అంబర్ పేటలో నమోదైన కిడ్నాపింగ్ కేసులపై కూడా విచారణ కొనసాగుతోందని మావల ఎస్సై రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.