– ఆదిలాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)చెన్నూర్ టౌన్/గర్మిళ్ల, అక్టోబర్ 20 : పోలీసు విధి నిర్వహణ అత్యంత శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు పరిమితమైనది కాదు. ఎండా.. వాన, పగలూ.. రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. సంపన్నుడు మొదలు.. సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనిక జవానులైతే.. అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడి విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకునేందుకు శుక్రవారం జిల్లాలో పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
పోలీసుల అమరవీరులను స్మరించుకునే రోజుకు మహోన్నత చరిత్ర ఉంది. 1959, అక్టోబరు 21.. అంటే సరిగ్గా 63 ఏళ్ల కిందట ‘భారత్ – టిబెట్’ సరిహద్దుల్లోని లడక్లోగల ఆక్సాయ్‌చిన్ వద్ద భారత్‌కు చెందిన కేంద్ర రిజర్వు పోలీసులు (సీఆర్పీఎఫ్)రక్షణలో ఉన్నారు. విపరీతమైన చలిలో 10 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, చైనా సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొచ్చుకువచ్చారు. వారిని ఈ 10 మంది పోలీసులు ధైర్యంగా ఎదిరించారు. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం అసువులు బాశారు. భారత దేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన తొలి సందర్భమది. ఇందుకుగాను అన్ని రాష్ర్టాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమయ్యారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. అమర పోలీసుల వీరుల త్యాగాన్ని స్మరించుకొని వారి కుటుంబాలకు సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నారు.
కేటగిరి 1 : పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు.. ‘రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర’
కేటగిరి 2 : డిగ్రీ.. ఆపైన విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ నివారణలో పోలీసు, పౌరుల పాత్ర అనే అంశాల మీద విద్యార్థులకు ‘ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు’ నిర్వర్తించి మొదటి ముగ్గురికి ప్రశంసాపత్రాలు అందించనున్నారు.
కేటగిరి 1 : కానిస్టేబుల్ అధికారి నుంచి ఏఎస్ఐ స్థాయి అధికారి వరకు.. ‘పౌరుల మన్ననలు పొందేందుకు పోలీసులు చేయాల్సిన కృషి’
కేటగిరి 2 : ఎస్ఐ స్థాయి అధికారి, పై స్థాయి అధికారులకు ‘సమర్థవంతమైన పోలీసింగ్‌లో మహిళా పోలీసుల పాత్ర.’
21 నుంచి 31వ తేదీ వరకు
రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 21 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మొదలైన విషయాలను ప్రజలకు వివరించనున్నారు.అమరులైన పోలీసులకు నివాళులర్పించడం, వారి త్యాగాలను గుర్తు చేస్తూ ర్యాలీలు, మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్ అమరవీరులను స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ తీయనున్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాల దగ్గరకు వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళి అర్పించనున్నారు. లఘుచిత్రాలు, ఫొటోల పోటీలు : పోలీస్ ఫ్లాగ్‌డేలో భాగంగా పోలీస్ త్యాగాలు, పోలీస్ విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా తక్కువ విడిది (నిడివి)గల షార్ట్ ఫిల్మ్స్, ఆర్టికల్స్‌ను ఈనెల 25వ తేదీలోపు స్పెషల్ బ్రాంచ్‌లో అందించాలి. సందేహాలకు ఫోన్ నంబర్ 8712656596కు సంప్రదించాలని సూచించారు.ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల గురించి తెలుపుతూ పబ్లిక్ స్థలాల్లో పోలీస్ కళా బృందంతో పాటల కార్యక్రమం నిర్వహించనున్నారు.
కడెం, అక్టోబర్ 20 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపెల్లి పంచాయతీ పరిధిలో గల అద్దాల తిమ్మాపూర్ గ్రామంలో ఆగస్టు 18, 1987న పీపుల్స్ వార్ నక్సల్స్ పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలుసహా, పది మంది పోలీసులు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) స్వయంగా అల్లంపెల్లి గ్రామాన్ని సందర్శించారు. కాల్పుల వివరాలతోపాటు, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల వివరాలు తెలుసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అల్లంపెల్లిలో పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి కడెం మండలంలోని రాజురా గ్రామంలో ఫిబ్రవరి 1, 1989న నక్సలైట్లు మందుపాతరతో పోలీసుల జీపును పేల్చేశారు. ఈ ఘటనలో ఎస్సైతోపాటు ఏడుగురు పోలీసులు అమరులయ్యారు. ఖానాపూర్ మండలంలోని తర్లపాడ్ గ్రామం వద్ద డిసెంబర్ 2, 1999న మరోసారి నక్సల్స్ మందుపాతర పెట్టడంతో ఖానాపూర్ ఎస్సైతోపాటు కానిస్టేబుల్ మృతిచెందాడు.
ఇటీవల పెంబి మండలం మావోయిస్టులకు పోలీసులకు కూడా ఎదురుకాల్పులు జరిగాయి. 1897 నుంచి ఇప్పటివరకు ఖానాపూర్ సర్కిల్ పరిధిలో 19 మంది పోలీసులు అమరులయ్యారు. యేటా అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరువీరుల దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా సంస్మరణ సభలు, శాంతి ర్యాలీలు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సమాజశ్రేయ స్సు కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాల కు అండగా ఉం టాం. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు. సంస్మరణ దినోత్సవం రోజున పోలీస్ అమరవీరుల కుటుంబాల సభ్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పోలీస్ ఉద్యోగానికి రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజం, స్ఫూర్తి నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రధాన ఉద్ధేశం.
– ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ, రామగుండం