నిర్మల్ టౌన్, అక్టోబర్ 19 : రెండేండ్లుగా మక్కజొన్న రైతులకు కలిసొస్తున్నది. ఆరుగాలం కష్టించి పండించిన మక్కకు మంచిధర లభిస్తున్నది. ఇప్పటికే పత్తి క్వింటాలుకు రూ.8,300 పలుకుతుండగా.. మక్కకు కూడా బహిరంగ మార్కెట్లో మద్దతుకు మంచి ధర దొరుకుతున్నది. గతేడాది మద్దతు ధర రూ.1,870 ఉండగా.. ఈసారి సర్కారు రూ.92 పెంచింది. దీంతో రూ.1,960 చేరింది. గతంలో మద్దతు ధర లభించకపోతే సర్కారు మార్క్‌ఫెడ్ ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసేది. ఈ యేడాది రైతుల వద్దకే వ్యాపారులు వచ్చి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు రూ.2,070 పెట్టి కొంటున్నారు. ప్రధానంగా ఇతర రాష్ర్టాల్లో అధిక వర్షాలు కురవడంతో దిగుబడి తగ్గింది. దీంతో మన మక్క మంచి డిమాండ్ ఏర్పడింది.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా వానకాలం సీజన్లో 40 వేల ఎకరాల్లో మక్క సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఖానాపూర్, ముథోల్, నిర్మల్ నియోజకవర్గ ప్రాంతాల్లో ఎర్రరేగడి, చలిదుబ్బ నేలలు అధికంగా ఉండడంతో పసుపుతో అంతర పంటగా మక్క వేస్తారు. జూన్, జూలై నెలల్లో పసుపు అంతర పంటగా సాగు చేస్తే అక్టోబర్‌లో మక్క.. పసుపు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చేతికొస్తుంది. ఏకకాలంలో రెండు పంటలు రైతుకు లాభాలు చేకూరుస్తుండడంతో జిల్లావాసులు మక్కకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ యేడాది వర్షాలు అధికంగా కురిసినప్పటికీ దిగుబడి బాగానే ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు దిగుబడి దాదాపు 25 క్వింటాళ్లు వస్తుండగా.. జిల్లావ్యాప్తంగా 1000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
మద్దతు మించి ధర
బహిరంగ మార్కెట్లో రెండేండ్ల నుంచి మక్కకు మంచి ధర లభిస్తున్నది. గతేడాది మద్దతు ధర రూ.1,870 ఉండగా.. ఈసారి సర్కారు రూ.92 పెంచింది. దీంతో రూ.1,960 చేరింది. గతంలో మద్దతు ధర లభించకపోతే సర్కారు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసేది. దీంతో మద్దతు ధర లభించేది. ఈ సారి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండానే మార్కెట్లో క్వింటాలు ధర రూ.2050-రూ.2070 పలుకుతున్నది. గతంలో పంటను నూర్పిడి చేసి బ్యాగుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే రవాణా చార్జీలు తడిసియోపడయ్యేవి. ఈసారి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులే కల్లాల వద్దకు వచ్చి రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడంతోపాటు సమయం వృథా కాదు. ఈసారి దక్షిణ భారతదేశంలో అధిక వర్షాలు కురవడంతో మక్క దిగుబడులు గణనీయంగా తగ్గాయని, దీంతోనే తెలంగాణలో పండించిన మక్కకు మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ధర మంచిగానే ఉంది..
వర్షాకాలంలో నాకున్న మూడెకరా ల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. పసుపులో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేయడంతో మొక్కజన్న చేతికి వచ్చింది. గతంలో మక్కను విక్రయించుకునేందుకు మార్క్‌ఫెడ్‌కు వెళ్లి మద్దతు ధర పొందే అవకాశం ఉండగా.. ఈసారి ప్రభుత్వ మద్దతు ధర కంటే బయటనే ధర బాగా ఉంది. ప్రస్తుతం బయట మార్కెట్లోనే రూ. 2,050 వరకు ధర పలుకుతున్నది.
– భోజన్న, అందకూర్, కుంటాల మండలం.
తిప్పలు తప్పాయి..
20 ఏండ్ల్ల నుంచి మక్క పండిస్తున్నా. పెట్టుబడికి తక్కువ కావడంతో గిట్టుబాటు అవుతున్నది. గతంలో మక్క పండిస్తే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చి నేరుగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర లభించడమే కాకుండా విక్రయించుకునేందుకు పడే తిప్పలు దూరమయ్యాయి.
– పోశెట్టి, రైతు, అందకూర్,కుంటాల మండలం.