నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 18 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 4,598 మంది బోదకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,580, మంచిర్యాలలో 855, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 830, నిర్మల్లో 1,333 కేసులు ఉ న్నాయి. బోదకాల వ్యాధి నివారణకు ఈ నెల 20 నుంచి 22 వరకు ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు.
ఎలా వస్తుంది.. : బోదకాలు క్యూలెక్స్ దోమ ద్వారా వస్తుంది.
మురుగు నీరు నిల్వ ఉన్న చోట ఇవి ఎక్కువగా ఉంటాయి. ఒక్కో దోమ వేలాది గుడ్లు పెడుతుంది. ఇది రాత్రి సమయంలో కుట్టినప్పుడు బోదకాలు వస్తాయి. వైద్యుల సమక్షంలో రక్త పరీక్ష చేస్తేనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. లక్షణాలు..: తరచూ జ్వరం రావడం, ఆయాసం, శోషనాళాలు పాడైపోయి రక్త ప్రసరణ ఆగి కాళ్లు, చేతులు వాపు రావడం, చర్మంపై పుండ్లు నీరు కారడం, దురద పెట్టడం, వరిబీజం, మర్మావయవాలు పాడవడం, గజ్జలు, చంకల్లో బిల్లలు కట్టడం వంటివి.
వచ్చే శరీర భాగాలు.. : బోదకాలు కాళ్ల భాగానికే కాక చేతులు, హైడ్రోసెల్, రొమ్ము, మర్మావయవాలకు కూడా వస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. : వ్యాధికారక దోమలను అరికట్టాలి. దోమల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. యేడాదికోసారి మాత్రలు మింగాలి. తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలి.
నివారణ మందుల పంపిణీ కార్యక్రమం..
ఈ నెల 20 నుంచి 22 వరకు బోదకాల నివారణకు అధికారులు మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేపడుతున్నారు. ఈ సారి వీటితోపాటు ఐవార్మెక్టిన్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు.
మాత్రల పంపిణీకి చర్యలు
బోదకాల వ్యాధి నివారణకు ఈ నెల 20 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, విద్యాసంస్థల్లో డీఈసీ, ఆల్బెండజోల్, ఐవార్మెక్టిన్ మాత్రల పంపిణీ చేస్తాం. ఇందుకుగాను ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చాం. యేడాదిన్నర వయసు నుంచి పైబడిన వారు మాత్రము మింగవచ్చు. ఇంటివద్ద పరసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉచిత మాత్రల పంపిణీ కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ ధన్రాజ్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్.