మంచిర్యాల, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యేటా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీ (జీపీ)లకు అవార్డులు ప్రకటిస్తున్నది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడేండ్లలో 61 జాతీయ అవార్డులు వరించాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) కింద రెండు విడుతలుగా 59 గ్రామాలు ఎంపికయ్యాయి. అలాగే 2021 సంవత్సరానికి గాను పారిశుధ్య విభాగంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి.. 2022 సంవత్సరానికి గాను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన రహిత) విభాగంలో దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ అవార్డుల ను సొంతం చేసుకున్నాయి. ఈ యేడాది (2023 సంవత్సరానికి) కూడా ఉత్తమ పంచాయతీల అవార్డుల కోసం కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. కాకపోతే.. ఎంపిక చేసిన జీపీలు కాకుండా.. ప్రతి గ్రామ పంచాయతీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది. తొమ్మిది అంశాల వారిగా.. ఒక్కో అంశానికి ప్రతి జిల్లా నుంచి మూడు పంచాయతీల చొప్పున 27 జీపీలను పరిగణలోకి తీసుకోనుంది. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 108 పంచాయతీలు బరిలో నిలువనున్నాయి.
ప్రధాన పోటీ ఇచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టి..
ప్రతి గ్రామ పంచాయతీ వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పటికీ ప్రధానంగా పోటీలో నిలిచే టాప్-27 గ్రామాలపై జిల్లాస్థాయి అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఆయా పంచాయతీల డాక్యుమెంటేషన్పైనా ప్రత్యేక దృష్టి సారించి అప్లోడ్ చేయనున్నారు. 108 పంచాయతీల్లో ఇప్పటికే 80కిపైగా గ్రామాలపై స్పష్టత రాగా.. మిగిలిన వాటి ఎంపికను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. తొమ్మిది అంశాలపై దాదాపు 113 ప్రశ్నలకు అధికారులు ఆన్లైన్లోనే సమాధానాలు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం 14 ప్రభుత్వశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, టీఎస్రెడ్కో, రెవెన్యూ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, గృహనిర్మాణ, విద్య, సివిల్ సప్లయ్, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ అంశాలవారీగా వివరాలు సేకరిస్తున్నారు.
ఎస్ఏజీవై కింద 59 గ్రామాలు ఎంపిక..
గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి చెందినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుందని భావించిన తెలంగాణ సర్కారు పల్లెలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నది. ఇందులో భాగంగా డ్రెయినేజీలు, రహదారులు, హరితహారం కింద మొక్కలు నాటడం, మలవిసర్జన రహిత గ్రామాలుగా మార్చడం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం వంటి వాటితో స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలిచేలా చేస్తున్నది. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా అర్హులకు అందిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలను ప్రకటిస్తున్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై) కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 59 గ్రామాలు ఎంపికయ్యాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో అధిక సంఖ్యలో గ్రామాలు ఎంపికవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 24, రెండో విడుతలో 30.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మూడు, నిర్మల్ జిల్లాలో రెండు గ్రామాలు ఎంపిక కావడం గమనార్హం.
పంచాయతీలతోపాటు మూడు మండలాలు..
మంచిర్యాల జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వివరాలను ఆన్లైన్ నమోదు చేయడంతో పాటు జిల్లాకు మూడు మండలాలను ఎంపిక చేసి వాటి మొత్తం పనితీరుపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. తొమ్మిది అంశాల్లో అడిగే 113 ప్రశ్నల కు ప్రతి దానికి పత్రాలతో సహా సాక్ష్యాలు కూడా కావాలి. క్షేత్ర స్థాయిలో 14 శాఖల అధికారులు పని చేస్తు న్నారు. ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిం చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తాం.
– నారాయణరావు, డీపీవో, మంచిర్యాల జిల్లా.
మూడేళ్ల ముందే కష్టపడ్డాం..
మా పంచాయతీకి పారిశుధ్య విభాగంలో అవార్డు వచ్చింది. 2019 నుంచే చెత్త నిర్వహణపై దృష్టి పెట్టాం. రెండు రిక్షాలు రోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేవి. తడి, పొడి చెత్త వేరు చేసే విషయంలో గ్రామస్తులకు అవగాహన కల్పించాం. రోజు రిక్షా వెళ్లే సమయానికే తడి, పొడి చెత్త వేరు చేసి వేస్తారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంది. వాటికి నీటి సరఫరా చేసే 100 శాతం ఉపయోగం లోకి తీసుకొచ్చాం. మురుగునీరు రోడ్లపై నిలువకుండా చర్యలు తీసుకు న్నాం. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్నాకే మా గ్రామానికి అవార్డు వచ్చింది. ఈసారి కూడా వివరాలు నమోదు చేస్తున్నాం. ఉత్తమ అవార్డు వచ్చిన సమయంలో రూ.8 లక్షల నగదు ప్రోత్సాహం ఇచ్చారు. ఆ నిధులతో 16 సీసీ కెమెరాలు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరోసారి అవార్డు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
– అభయ్కుమార్, రుయ్యాడి గ్రామ పంచాయతీ సెక్రటరీ.