ఎదులాపురం, అక్టోబర్ 15 : భూముల సర్వేను అటవీ హక్కుల చట్ట ప్రకారం నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బుర్నూర్ గ్రామంలో తనుగుల గంగన్న సాగు చేస్తున్న భూమిని సర్వే టీం, ఎఫ్ఆర్సీ సభ్యులు చేస్తున్న సర్వేను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు సాక్షాలు, గ్రామ పెద్ద స్టేట్మెంట్ను తీసుకోవాలని, భూమి యొక్క విస్తీర్ణాన్ని సరిహద్దులతో పాలిగన్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు. ప్రతి టీం రోజుకు 10 సర్వేలు నిర్వహించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో శివలాల్, ఎఫ్ఆర్వో ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్, ఎఫ్ఆర్సీ టీం సభ్యులు, గ్రామస్తులు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.
బోధనలో మార్పు అవసరం
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 15 : విద్యార్థుల సామర్థ్యాలు బాగుండాలంటే బోధనలో మార్పు అవసరమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉపాధ్యాయులకు సూచించారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన తీరు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఉపాధ్యాయులు బోధనా ఉపకరణాలను వినియోగిస్తూ ఆటాపాటలతో చదువులు చెప్పాలన్నారు. తెలుగు, ఆంగ్లం, గణితం విషయాల్లో వివిధ ప్రక్రియల ద్వారా బోధన చేయాలని, అనంతరం సామర్థ్యాలను పరిశీలించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మన ఊరు- మన బడి కింద చేపట్టిన పనులు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఈవో ప్రణీత, సెక్టోరియల్ అధికారి నర్సయ్య, ఎంపీడీవో శివలాల్, సర్పంచ్ పెందూర్ గంగారాం, ప్రధానోపాధ్యాయుడు గంగన్న, పీఆర్ ఏఈ సలావొద్దీన్ ఉన్నారు.