‘సర్వేంద్రియానం నయనం ప్రదానం’అనేది నానుడి. మానవ శరీరంలో అతిసున్నితమైన అవయవం కండ్లు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇవీ బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలం. అందాలను వీక్షించగలం. లేకపోతే అంతా చీకటిమయమే. పుట్టినప్పటి పుంచి కనుమరుగయ్యే వరకు కండ్లను భద్రంగా చూసుకోవాలి. నేత్రాల సంరక్షణకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంచనా ప్రకారం వరల్డ్‌లో కోట్ల సంఖ్యలో అంధులు ఉన్నట్లు అంచనా. యేటా అక్టోబర్ రెండో గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. నేడు ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ సందర్భంగా ‘నమస్తే’ తెలంగాణ ప్రత్యేక కథనం..
– మంచిర్యాల ఏసీసీ, అక్టోబర్ 12
పిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి..
గతంలో తల్లులు పిల్లలకు చందమామను చూపిస్తూ ఆహారం తినిపించేవారు. ప్రస్తుతం సెల్‌ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారు. దీనివల్ల కండ్లలోని సున్నితమైన రెటీనా భాగం పాడైపోయి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చూపుకోల్పోవడం, మెల్లకన్ను ఏర్పడే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. అందువల్ల పిల్లలను మొబైల్‌కు దూరంగా ఉంచాలి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారు, కళాశాల విద్యార్థులు కంప్యూటర్, ల్యాప్‌టాప్ వాడినపుడు కండ్లపై శ్రద్ధ వహించి స్క్రీన్ వెలుతురు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక అప్పుడే పుట్టిన బిడ్డ విషయంలో తల్లులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్రాలను గమనిస్తూ ఉండాలి. ఏమైనా తేడా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు బ్లాక్ బోర్డుపైన రాసిన అక్షరాలు, పుస్తకాల్లోని అక్షరాలు కనిపించకపోతే వైద్యుడిని సంప్రదించి దృష్టి లోపం ఉన్నైట్లెతే కండ్లద్దాలు వాడాలి. కాగా.. 40 ఏండ్లు దాటిన వారిలో సాధారణంగా కంటిచూపు మందగిస్తుంది. శాశ్వత అంధత్వానికి గురికాకుండా నేత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. కావాల్సిన పోషకాహారం తీసుకోవాలి. సంరక్షణ చర్యలు తీసుకోవాలి.
అశ్రద్ధ వద్దు..
మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉంటుంది. అందుకే కండ్లను నిర్లక్ష్యం చేయరాదు. ప్రస్తుతం జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల పుట్టుకతోనే కంటిచూపును కోల్పోతున్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు విటమిన్-ఏ కు సంబంధించిన ప్రొటీన్ పదార్థాలు తీసుకోవాలి. ప్రతి ఆరు నెలలకోసారి కంటి వైద్యుడిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ యశ్వంత్‌రావు, ప్రభుత్వ జనరల్ దవాఖాన నేత్ర వైద్య నిపుణులు, మంచిర్యాల