చెన్నూర్ దవాఖానను వంద పడకలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పట్టణంలో 30 పడకల దవాఖాన భవన పనులు కొనసాగుతుండగా, తాజా ఉత్తర్వులకు అనుగుణంగా నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని వైద్యవిధాన పరిషత్ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని సీఎం కేసీఆర్ దృష్టికి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ తీసుకెళ్లారు. దీంతో పాటు వంద పడకలకు పెంచాలని ప్రతిపాదనలు సర్కారుకు పంపగా, ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాలతో చెన్నూర్ పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు స్థానికంగానే అందనుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
-చెన్నూర్, అక్టోబర్ 12
చెన్నూర్ ప్రాంత ప్రజలకు మంచి రోజులొచ్చాయి. పట్టణంలోని పభుత్వ దవాఖానను 100 పడకలకు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నూర్ ఎమ్మెల్యేగా బాల్క నుమన్ ఎన్నికైనప్పటి నుంచి చెన్నూర్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలనే లక్ష్యంతో విశేష కృషి చేస్తున్నారు. పలు మార్లు సీఎం కేసీఆర్‌ను కలిసి ఇక్కడి దవాఖాన పరిస్థితులు, వైద్య సేవల గురించి వివరించారు.
చెన్నూర్‌లో దవాఖాన శిథిలావస్థలో ఉన్న భవనంలో కొనసాగుతున్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, దవాఖాన స్థాయిని పెంచాలని, వైద్య విధాన పరిషత్ పరిధిలోని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రెండేళ్లక్రితమే దవాఖాన స్థాయిని 30 పడకలకు పెంచి, కొత్త భవన నిర్మాణానికి రూ. 7 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అనంతరం దవాఖానను వైద్యారోగ్యశాఖ నుంచి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మార్చుతూ ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దవాఖాన స్థాయిని 100 పడకలకు పెంచుతూ, నిర్మాణ వ్యయం రూ 10.45కోట్లు (సంవత్సరానికి), వైద్యపరికరాలు, నిర్మాణేతర వ్యయం రూ 21.70 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రజలకే కాకుండా, జయశంకర్ భూపాలపల్లి, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
– చెన్నూర్, అక్టోబర్ 12
వంద పడకలతో మారనున్న రూపురేఖలు
దవాఖాన స్థాయిని 100 పడకలకు పెంచడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. చెన్నూర్ మున్సిపాలిటీతో పాటుగా చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలాల ప్రజలకు ప్రయోజనం కలుగనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం, మహారాష్ట్రలోని సిరోంచ తాలూక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మద్దేడ్, భూపాలపట్నం ప్రాంతాల ప్రజలకు కూడ మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. దాదాపు 150 గ్రామాలకు చెందిన 1,63,000పైగా జనాభాకు ఈ దవాఖాన ద్వారా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ప్రస్తుతం వీరంతా ఎలాంటి వైద్యం కావాలన్నా జిల్లా కేంద్రంలోని దవాఖానపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఇకపై వీరికి ఆ బాధ తప్పనుంది. అంతేకాకుండా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్లలేక, వెళ్తే ఫీజలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారు. వంద పడకల దవాఖాన పూర్తయితే పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల రక్కసి నుంచి కూడా ఊరట లభించనుంది.
‘100 పడకల’ మంజూరుపై సంబురాలు
చెన్నూర్, అక్టోబర్ 12: చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను 100 పడకలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో, టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు బుధవారం సంబురాలు నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కొత్త దవాఖాన భవనం వరకు ర్యాలీ తీశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కొత్త భవనం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అర్చనాగిల్డా, కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజోద్దీన్, సింగిల్‌విండో చైర్మన్ చల్ల రాంరెడ్డి, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, జగన్నాథుల శ్రీను, వేల్పుల సుధాకర్, దోమకొండ అనిల్, కో ఆప్షన్ సభ్యుడు అయూబ్, కేవీఎం శ్రీనివాస్, కిష్టంపేట సర్పంచ్ రాకేశ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, పెండ్యాల లక్ష్మణ్, అరీఫ్, వేముల మహేందర్, నాయిని సతీశ్, మంత్రి రామయ్య, కొండపర్తి వెంకటరాజం, జనగామ రాజశేఖర్, అమన్, కొడిపెల్లి రాజారాం, కమటం మనోహర్, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు పాల్గొన్నారు.
గతంలో పట్టించుకున్నోళ్లే లేరు..
గతంలో ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు, మంత్రి పదవులు చేపట్టినప్పటికీ నియోజవర్గంలో వైద్య సదుపాయాల కల్పనపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. విప్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ వచ్చాకే నియోజకవర్గంలో వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం కొత్త భవనం, వంద పడకల దవాఖాన ఏర్పాటులో ఆయన చొరవ కీలకంగా మారింది.
స్థానికుల హర్షం
చెన్నూర్ దవాఖానను వంద పడకలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడుతున్నారు. దవాఖాన అభివృద్ధికి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఇందుకు కృషి చేసిన విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
చురుగ్గా కొత్త భవన నిర్మాణ పనులు
కొత్త భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పలుమార్లు సందర్శించి పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి, దవాఖానను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. కాగా, కొత్త భవనాన్ని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు స్లాబ్ పనులు పూర్తయ్యాయి. పది రోజుల్లో మొదటి అంతస్తు స్లాబ్ పనులు కూడా పూర్తి కానున్నాయి. డాక్టర్లు ఔట్ పేషెంట్లను పరీక్షించేందకు ప్రత్యేక గదులు, అధునాతన సౌకర్యాలతో ఆపరేషన్ థియేటర్, రోగులకు విభాగాల వారీగా వార్డులు, సిబ్బంది కోసం ప్రత్యేక గదులను నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు వెళ్లేందుకు మెట్లతో పాటు లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పనులు పూర్తై మరో రెండు, మూడు నెలల్లో కొత్త దవాఖాన భవనం రోగులకు అందుబాటులోకి రానుంది.
వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తాం..
సకల వసతులతో కూడిన వంద పడకల దవాఖానను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే కొత్త భవన పనులు కొనసాగుతున్నాయి. కొత్తగా ఇచ్చిన ఆదేశాలతో వంద పడకలతో దవాఖానను పూర్తి చేస్తాం. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా చెన్నూర్ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం. ఇప్పటికే వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తీసుకురావడంతో, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. వంద పడకల దవాఖాన మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
-బాల్క సుమన్, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్ సుమన్‌కు కృతజ్ఞతలు
ఈ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కృతజ్ఞతలు. పాత భవనం పూర్తిగా కూలిపోయే దశకు చేరుకుంది. అందుకే కొత్తది కావాల్నని ఎన్నో రోజుల నుంచి చూస్తున్నం. ఇప్పుడు మా ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక దృష్టి పెట్టి, కొత్తది కావాల్నని ప్రభుత్వాన్ని ఒప్పించిన్రు. వంద పడకల దవాఖానగా మార్చేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇప్పటికే భవనం మంచిగ కడుతున్నరు. ఇది పూర్తయితే అందరూ ఆడికే పోయి రోగానికి చూయించుకుంటరు. కొత్త డాక్టర్లు కూడా వత్తరని అధికారులు చెబుతున్నరు. తొందరగా పూర్తయితే బాగుంటది. అందరికీ ఇక్కడే మంచి వైద్యం అందుతది. వంద పడకల దవాఖాన మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఇందుకు కృషి చేసిన మా ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పట్టణవాసులంతా రుణపడి ఉంటరు.
-పొన్నం సాగర్ (యువకుడు, చెన్నూర్)
పేదలకు ఎంతో ఉపయోగం
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృషితో చెన్నూర్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందబోతున్నాయి. ఈ దవాఖాన నిర్మాణం పూర్తయితే నిరుపేదలకు ఎంతో సౌలత్ అయితది. గ్రామీణ ప్రాంత రోగులే ఎక్కువగా ఈ దవాఖానకు వస్తుంటరు. వీరంతా నిరుపేదలు. ప్రైవేటు దవాఖానకు వెళ్లి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత వీరికుండదు.ఈ దవాఖాన మన జిల్లాతోపాటు మహారాష్ట్ర వాసులకు కూడా ఉపయోగపడనుంది.
-వంగల సమ్మాగౌడ్ (యువకుడు, చెన్నూర్)
అందుబాటులోకి మంచి వైద్యం
చెన్నూర్‌లో ప్రభుత్వ దవాఖానకు కొత్త బిల్డింగ్ కడుతున్నరు. ఇప్పుడు ప్రభుత్వం వంద పడకలు చేయాల్నని చెప్పింది. పాత భవనంలో చాలా ఇబ్బందులుం డేవి. ఇప్పుడు బాల్క సుమన్ సారు కొత్త భవనం కట్టిస్తున్నరు. ఇది పూర్తయితే పేదలకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తది. చుట్టుపక్కల చాలా మండలాలకు ఇదే పెద్ద దవాఖాన లెక్క అయితది. అన్ని రకాల రోగాలకు ఇక్కడే వైద్యం అందుతది. సర్కారు మంచి నిర్ణయం తీసుకున్నది. కొత్త భవనం తొందర్లనే అందుబాటులోకి తెస్తరనుకుంటున్న. ప్రజలకు మంచి చేసుట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుగనే ఉంటది. మంచి దవాఖాన కట్టిస్తున్నందుకు మేమంతా రుణపడి ఉంటం.
– మోడెం రమేశ్( పంకిడి సోమారం, మండలం: కోటపల్లి)