మంచిర్యాల, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని ప్రైవేట్ దవాఖానలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పది రోజులపాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 253 దవాఖానలను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 61 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఓ ఆస్పత్రిని కూ డా సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు.
20కిపైగా బృందాల తనిఖీలు..
ప్రతి జిల్లాకు ఐదు నుంచి ఆరు బృందాల చొప్పున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20కి పైగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మంచిర్యాల జిల్లాలో రోజు సగటున 10-12 ఆస్పత్రులు, ఆదిలాబాద్‌లో 7-8, నిర్మల్‌లో 5-6 హాస్పిటల్స్‌ను తనిఖీ చేశా రు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తంగా 15 దవాఖానలను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ అయ్యిందా? లేదా? అందులో క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా? లేదా..? మల్టీస్పెషాలిటీల్లో ఆయా స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారా? ఒక స్పెషలిస్టు వైద్యుడు ఉండి.. వేరే స్పెషాలిటీలో వైద్యం అందిస్తున్నాడా? అనే అంశాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను, వైద్యుల డిగ్రీలను తనిఖీ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి నోటీసులు జారీ చేశారు.
మంచిర్యాలలో నాలుగు నెలల క్రితమే..
నాలుగు నెలల క్రితమే మంచిర్యాల జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న 37 దవాఖానలను అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని కారణంగా వాటిని సీజ్ చేశా రు. అనంతరం నిబంధనల ప్రకారం ఆయా ఆస్పత్రులకు తిరిగి అనుమతులు ఇచ్చారు. అలాగే ఏడుగురు వైద్యులు ఉక్రెయిన్‌లో చదువుకొని వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఉక్రెయిన్ ఎండీ ఫిజిషీయన్ చేస్తే మన దగ్గర ఎంబీబీఎస్‌గా విధులు నిర్వర్తించాలి. కానీ..
అందుకు విరుద్ధంగా అందులో కొందరు వైద్యు లు ఎండీ ఫిజిషీయన్లుగానే కొనసాగుతున్నట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ సారి తనిఖీల్లో నిబంధనలు పాటించని ఆస్పత్రుల సంఖ్య తగ్గిందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేతన్ చౌహాన్ అనే ఓ వైద్యుడు ఉక్రెయిన్‌లో ఎండీ చేశాడు. అక్కడ ఎండీ అంటే మన దగ్గర ఎంబీబీఎస్‌తో సమానం. కానీ.. ఆయన ఆస్పత్రిలో డిస్ప్లే చేసే బోర్డుపై మాత్రం ఎండీ అని రాసుకున్నాడు. నిబంధనల ప్రకారం ఎండీ ఈక్వల్ టూ ఎంబీబీఎస్ అని రాసుకోవాలి. బోర్డు ఇలా రాసుకున్నందుకు గతంలోనూ ఓసారి ఈయనకు నోటీసులు ఇచ్చారు. అయినా ఆ వైద్యుడు ఇప్పటికీ ఎండీగా నే చలామణి అవడంపై వైద్య శాఖాధికారులు సీరియస్ అయ్యారు.మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశారు.
మరోసారి తనిఖీ చేస్తాం..
మంచిర్యాల జిల్లాలో చేసిన తనిఖీల్లో ఐదు దవాఖానలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించాం. పార్థ డెంటర్ ఆస్పత్రి వైద్యుడు డెంటల్ కాకుండా స్కిన్‌కు సంబంధించిన వైద్యం అందిస్తున్నట్లు గుర్తించాం. వైద్యులు, స్టాఫ్ సరిగా లేనందున ఆర్యన్ ఆస్పత్రి, స్టాఫ్‌నకు సంబంధించిన సర్టిఫికేట్లు లేని కారణంగా ఓం సాయి ఆస్పత్రికి నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చిన దవాఖానలను త్వరలోనే మరోసారి తనిఖీ చేస్తాం. జరిగిన పొరపాట్లను సరిచేసుకుంటే యథావిధిగా సేవలు అందించేందుకు అవకాశం ఇస్తాం. లేని పక్షంలో కఠిన చర్యలకు సిఫార్సు చేస్తాం.
-జీవీ సుబ్బారాయుడు, డీఎంహె చ్వో, మంచిర్యాల