నిర్మల్ టౌన్, అక్టోబర్ 12 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటగా రైతులు పత్తి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అది చేతికి వస్తుండడంతో ప్రభుత్వం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నది. ఈ నెల 14 నుంచి దశలవారీగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు చేపట్టేలా మార్కెటింగ్‌శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. నిర్మల్‌లో 1.47 లక్షల ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 3.12 లక్షల ఎకరాలు, మంచిర్యాలలో 1.49 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌లో 3.72 లక్షల ఎకరాలు సాగైనట్లు అధికారులు అంచనా వేశారు.
దసరా పండుగకు ముందే పత్తి పంటను పోగు చేసిన రైతులు.. మార్కెట్లో విక్రయించేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం నుంచి కొనుగోళ్లు చేపట్టనున్నది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా.. ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, జైనథ్, నిర్మల్, సారంగాపూర్, కుభీర్, భైంసా, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, జైనూర్ తదితర వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్, జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొనుగోళ్లను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
మార్కెట్లో మంచి ధర..
ప్రస్తుతం మార్కెట్లో పత్తి పంటకు బాగానే డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయంగా పత్తికి బాగా డిమాండ్ ఉండడంతో ధర రూ.8,500 నుంచి రూ.9 వేల వరకు పలుకుతున్నది. కుభీర్‌లో ప్రారంభం రోజే రూ.10 వేల ధర పలికింది. ప్రస్తుతం పత్తికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రూ.6,380 ప్రకటించగా.. మద్దతు ధర కంటే అదనంగా రూ.2 వేలు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్దతు ధర కంటే తక్కువకు పత్తిని కొనేవారు. దీంతో సీసీఐని రంగంలోకి దింపేవారు. మూడేళ్ల నుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకుండానే మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఏర్పడుతున్నది. దీంతో రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 10.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా సుమారు 80 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రానుందని అంచనా వేస్తున్న అధికారులు.. ఆ పత్తిని వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే జిన్నింగ్ ఫ్యాక్టరీలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మార్కెటింగ్ అధికారులతో పత్తి కొనుగోళ్లపై దృష్టి సారించిన అధికారులు.. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టనున్నారు. పత్తి దిగుబడులు తగ్గితే ధర రూ.10 వేలకు పైగానే పలికే అవకాశం ఉండడంతో చాలా మంది రైతులు ఈ సారి తమకు పత్తి పంట కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా భూములు ఎత్తైన ప్రదేశాల్లో ఉండగా.. అధిక వర్షాలు కురిసినప్పటికీ పత్తిని సాగు చేయడంతో ఏపుగా పెరిగి పూత, కాత కాసి దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహిస్తాం..
పత్తి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తున్నది. ఇప్పటికే జిల్లాస్థాయిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాం. పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం. పత్తికి రూ.6,380 మద్దతు ధర ప్రకటించినప్పటికీ బయట మార్కెట్లో రూ.8,500 నుంచి రూ. 9,500 ధర పలుకుతున్నది. పాత పత్తికి రూ.10వేల ధర పలుకుతున్నది. రైతులు మార్కెట్లోనే పత్తిని విక్రయించుకోవాలి.
– అశ్వక్ అహ్మద్, మార్కెటింగ్ అధికారి