ఆదిలాబాద్, ఆక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కులవృత్తులకు చేయూతనందించి వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా సబ్సిడీపై గొర్రెలు, ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. నీలి విప్లవంలో భాగంగా ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు, గ్రామాల్లో ఉపాధి లభించక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఏటా వానకాలంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండినా గత ప్రభుత్వాల సహకారం లేక చేప పిల్లలను పెంచలేని పరిస్థితి ఉండేది. దీంతో కుటుంబాల పోషణ కోసం వివిధ జిల్లాలు, పట్టణాల్లో కూలీలుగా పనిచేస్తూ ఉపాధి పొందేవారు. సమైక్య రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలకు 50 శాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేసేవారు. కేవలం రూ.25వేల యూనిట్‌ను 50శాతం రాయితీతో రూ.12,500కు ఇచ్చేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను పోత్సహిస్తున్నది. అందులో భాగంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. మెరుగైన ఉపాధి కల్పించేందుకు మేలు రకమైన చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. సర్కారు అందిస్తున్న సాయంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1.28 కోట్ల చేప పిల్లలు..
ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరగా, చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో అధికారులు ఈ ఏడాది ఎక్కువ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులతో పాటు 284 చెరువుల్లో 1.28 కోట్ల చేప పిల్లలను మత్య్సకారులకు ఉచితంగా పంపిణీ చేసేలా ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలో 70 మత్స్యకార సంఘాలు ఉండగా, 4,200 మంది సభ్యులున్నారు. చెరువుల్లో నీటి లభ్యత, చేప పిల్లల పెరుగుదలకు అనుగుణంగా కట్ల, రవ్వు, మృగాల వంటి చేప పిల్లల వదులుతున్నారు. చెరువుల్లో 35-40 ఎంఎం, ప్రాజెక్టుల్లో 80-100 ఎంఎం చేప పిల్లలను వేస్తున్నారు. సెప్టెంబర్ రెండోవారంలో పంపిణీ ప్రారంభంకాగా, ఇప్పటి వరకు 83 చెరువుల్లో 48 లక్షల చేప పిల్లలను వదిలినట్లు అధికారులు తెలిపారు. చేపల పెంపకాన్ని పారదర్శకంగా చేపట్టేందుకు అధికారులు జీపీఎస్ విధానం అమలు చేస్తున్నారు.
నెలాఖరు వరకు లక్ష్యం పూర్తి చేస్తాం..
ఈ ఏడాది చేపల పంపిణీ ప్రక్రియ సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభించాం. ప్రాజెక్టులు, పెద్ద కుంటలు, చెరువుల్లో నీటి లభ్యతను బట్టి పిల్లలను వదులుతున్నాం. ఇప్పటి వరకు 83 చెరువుల్లో 48 లక్షల పిల్లలను వదిలాం.
– విజయ్‌కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఆదిలాబాద్