దండారి పండుగ అంటేనే ఆదివాసీ గూడేల్లో అంబరాన్నంటే వేడుక. ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పూజోత్సవం. డప్పుల దరువు, గజ్జెల మోత, గుస్సాడీలు వేసే స్టెప్పులతో గూడేలు దద్దరిల్లనున్నాయి. ఒకవైపు కోలాట నృత్యాలు, మరోవైపు గోండి పాటల నృత్యం, హాస్యనాటికల ప్రదర్శనలతో ఈ వేడుకలు అలరించనున్నాయి. దీపావళికి ముందు భోగి పండుగతో ఈ వేడుక ప్రారంభం కానుంది. ఆశ్వీయుజ పౌర్ణమి అనంతరం ప్రారంభమయ్యే అద్భుతమైన వేడుక ఇది. భోగితో ప్రారంభమై, కొలబొడితో ముగుస్తుంది. దండారి సంబురాలను చూసేందుకు పల్లెలతో పాటు పట్టణ ప్రజలు కూడా తరలివస్తారు. వారం, పది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలకు గూడేలన్నీ సిద్ధమవుతున్నాయి.
కఠోర దీక్ష.. గుస్సాడీల సొంతం..
దండారిలో గుస్సాడీ(గురు)ల పాత్ర కీలకం. నెమిలి పింఛంతో చేసిన టోపీలు, ముందు రెండు పశువుల కొమ్ములు, మధ్యలో ఓ అద్దం, చుట్టూ రంగురంగుల అలంకరణ వస్తువులు, భుజానికి అడవి జంతువుల తోలు, నడుము, కాళ్లకు గజ్జెలు, మెడలో రుద్రాక్షమాల వేసిన ఆదివాసీ దేవుని ప్రతిరూపమే గుస్సాడీలు. గోండి భాషలో వారిని గుస్సాడీ అనకుండా ‘గురు’ అని పిలుస్తారు. భోగి పండుగతో మాలధారణ వేసినప్పటి నుంచి వారు దీక్షలో కొనసాగుతారు. దీక్ష చేపట్టిన నాటి నుంచి పూర్తయ్యే వరకు స్నానాలు ఆచరించకుండా, చలిలోనూ పాదరక్షలు, బట్టలు ధరించకుండా కఠోర దీక్షలో ఉంటూ నేలపైనే నిద్రిస్తారు.
యువకుల ప్రత్యేక వేషధారణ..
దండారి ఉత్సవంలో పాల్గొనే గుస్సాడీల తరువాత మరో కీలక పాత్ర ఆడ వేషధారణలో ఉండే యువకులది. వీరు కూడా చివరి రోజైన కొలబొడి వరకు దీక్షలో ఉంటారు. ఐష్టెశ్వర్యాలు కలగాలని, కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలుగాలని వీరు ఇతరుల ఇండ్లకు వెళ్లినప్పుడు దీవిస్తారు.
దండారిలో రకాలు..
దండారిలో ఆరాధ్య దేవత పద్మల్పురికాకో ప్రధానమైనది. ఇందులో ఏత్మాసార్ పేన్ పేరిట నాలుగో సగా(గోత్రం)లలో ఉత్సవాలు నిర్వహిస్తారు. నాల్గు సగలవారు గుమేల, ఐదో సగల వారు ఫర్ర, ఆరో సగల వారు కోడల్, ఏడో సగల వారు తపల్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా కోలాటం, మహిళల బృందాలు వేర్వేరుగా ఉంటాయి. కోలాట నృత్యంలోనూ భేటికోలా, మాన్కోలా, సదర్కోలా, కోడల్కోలా, సార్కోలా, కలివల్కోలా వంటి అనేక రకాలుగా కోల నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం.
ఆద్యంతం.. వినోదభరితం
ఓ గ్రామానికి చెందిన దండారీ బృందం మరో గ్రామానికి బయలుదేరి వెళ్లడం ఓ వినోదపు కార్యక్రమం. గుస్సాడీ బృందం ఏ గ్రామానికి వెళ్లాలన్నా రాత్రి పూటనే బయల్దేరుతారు. రాత్రంతా నృత్యాలు, గోండి పాటలపై డ్యాన్సులు, హాస్యపు నాటికలు ప్రదర్శించి మిగతా వారికి వినోదాన్ని అందిస్తారు. ఇక ఉదయం మాన్కోలాతో నృత్యాలు ప్రారంభించి సార్కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు ఘనస్వాగతం పలికిన అనంతరం మరుసటి రోజున ప్రత్యేక విందును ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతారు. దీంతో రెండు గ్రామాల మధ్య స్నేహభావం పెంపొందుతూ, సంస్కృతీసంప్రదాయలు కాపాడుకునే వీలుంటుంది.
గుస్సాడీ టోపీలు, డప్పుల తయారీ
దీపావళి పండుగ సందర్భంగా గోండులు, కొలాం గిరిజనులు నిర్వహించే దండారీ ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు అవసరమైన గుస్సాడీ టోపీలతోపాటు డప్పులు తయారు చేస్తున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం జంగుబాపుతోపాటు తన కుమారుడు మెస్రం ఇంద్రు దండారి ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల సామగ్రితోపాటు పరికరాలు, నెమలి ఈకలతో గుస్సాడీ టోపీలు, కొత్త డప్పులు, డోళ్లను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజన గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వీటిని కొనుగోలు చేసేందుకు తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని యాపల్గూడ, నిర్మల్లోని ఆరెపల్లి, ఇంద్రవెల్లి మండలంలోని సమక, పొల్లుగూడ, నార్నూర్, జైనూర్, ఉట్నూర్ మండలాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు వచ్చి గుస్సాడీ టోపీలు కొనుగోలు చేస్తున్నారు.
కొలబొడితో వేడుకలు ముగింపు..
అంబరాన్నంటేలా నిర్వహించే దండారి ఉత్సవాలు కొలబొడితో ముగిస్తారు. తమ కార్యక్రమాలు, అతిథుల రాకపోకలు పూర్తి కాగానే గ్రామంలోని దండారి బృందం ఇంటింటికీ వెళ్లీ దర్శనం ఇస్తారు. దీంతో ఇంటి గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచిన నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తారు. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని పాటలు పాడుతూ హారతి పూజ నిర్వహిస్తారు. ఇలా అన్ని ఇండ్లు పూర్తి కాగానే కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు.
దండారి వేడుకలకు రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం
ఆదివాసీ పండుగలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దండారి వేడుకల సందర్భంగా గ్రామాల్లో ఒక్కో గుస్సాడీ బృందానికి రూ. పది వేలు అందిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందు కోసం రూ. కోటి మంజూరు చేసింది. ఆదివాసీల అతి పెద్ద వేడుకను అంబరాన్నంటేలా నిర్వహించుకునేలా సర్కారు చేయూతనిస్తున్నది.
సంతోషాలు పంచుకునే పండుగ..
సంతోషాన్ని పంచుకునే వేడుక దండారి పండుగ. గ్రామంలో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సహంగా పాల్గొంటారు. పురుషులతో పాటు మహిళలు నృత్యాలు చేస్తారు. నాటికలు, పాటలు, కోలాటం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మేం నిర్వహించుకునే అతి పెద్ద వేడుక ఇది. సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా ఈ వేడుకను కొనసాగిస్తున్నం. మా పిల్లలు కూడా ఈ వేడుకలు కొనసాగించాలని అనుకుంటున్నం.
-సిడాం జగన్నాథ్రావ్, ఆదివాసీ సీనియర్ నాయకుడు కెస్లాగూడ
ఏత్మాసార్ పేన్ ఆశీస్సులు ఉండాలని..
భక్తి శ్రద్ధలతో కొలిచే ఏత్మాసార్ పేన్ ఆశీస్సులు మాకు ఉండాలని దండారి సంబురాలను వైభవంగా నిర్వహిస్తం. గతంలో మా పెద్దలు పాటించిన ఆచారాన్ని కొనసాగిస్తున్నం. పొరుగు రాష్ర్టాలతో సంబంధాలు పెరగాలంటే ఇలాంటి వేడుకలే మాకు వేదిక. ఇలాగే ముందు తరాలవారు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుతున్న. దండారి వేడుకలు మరిచిపోలేని అనుభూతినిస్తయి. ఈ వేడుకలు జరుగుతున్నంత కాలం వినోదంతో గడిచిపోతుంది. అందరం కలిసి ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపే కాలం ఇది. ఈసారి కూడా ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్న.
-కుడ్మెత జగ్గేరావ్, దండారి బృందం సభ్యుడు, గోండ్ ఝరి
తరతరాల ఆచారం..
దండారి వేడుకల్లో బృందాలను అతిథులుగా ఆహ్వానించడం తరతరాల నుంచి వస్తున్న ఆచారం. పూర్వీకులు నేర్పిన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తున్నం. ఈ కలయిక ద్వారా ఇరువర్గాల మధ్య బంధుత్వం బలపడుతుంది. ఆచరణ కఠినంగా ఉన్నప్పటికీ రాబోయే తరాలకు అందించాలనే లక్ష్యంతో వేడుకలు కొనసాగిస్తు న్నం. రాష్ట్రంలోని ఆదివాసులే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా దండారిలను ఆహ్వానిస్తం. మేము కూడ అక్కడికి వెళ్తుంటం. ఈ వేడుక ద్వారా మా కుటుంబాల్లో ఆనందం, సుఖశాంతులు కల్గుతాయి. -కుర్సేంగ ధర్మరావ్, దండారి నిర్వాహకుడు చౌపన్గూడ(కెరమెరి)