దస్తురాబాద్, అక్టోబర్ 11 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెం, ఆకొండపేట గ్రామాల్లో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా అలంకరించారు. ఆయా ప్రాంతాల్లోని కూడలిలో మహిళలు, యువతులు, చిన్నారులు పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి పోయిరా బతుకమ్మ..మళ్లీరా గౌరమ్మ అంటూ సెలవు పలికారు.
కుంటాల, అక్టోబర్ 11 : మండల కేంద్రంలో మంగళవారం సద్దుల బతుకమ్మ సంబురాలు హోరెత్తాయి. మహాదేవ్ మందిర్, రాంనగర్, అంబేద్కర్ కాలనీల్లో మహిళలు మహిళలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మలను పేర్చి పూజలు చేశారు. బతుకమ్మలను ఓచోట ఉంచి చుట్టూ ఆటాపాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేశ్, నాయకులు శ్రీరామ్, సంతోష్, నిమ్మ నర్సయ్య, రాజు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూశారు.