ఎదులాపురం, అక్టోబర్ 11 : బాలికల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే సూచించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం న్యాయ విజ్ఞన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి కోసం డీఎల్ఎస్ఏ అండగా ఉంటుందన్నారు. డీఎల్ఎస్ఏ అందించే న్యాయ సహాయం, ఇతర సేవలను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, ప్రిన్సిపాల్ భగవాండ్లు, న్యాయవాది రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
బాలికలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
బాలికలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బోథ్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల హక్కులు, సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్ష, హింస వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, విద్యాహక్కు చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు హరీశ్, కుమ్మరి విజయ్‌కుమార్, జమీర్‌ఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి
బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి అన్నారు. హలియన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని బాల రక్షక భవన్లో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్మన్ మాట్లాడుతూ ఆడపిల్లలు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో లింగ వివక్షత లేకుండా సమానత్వాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి పాల్గొన్నారు.