జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన వీరుడి త్యాగాలను యావత్ ప్రజానీకం స్మరించుకున్నది. ఆదివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో భీం 82వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించగా, ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనసందోహంతో పోరుగడ్డ పులకించింది. డప్పు చప్పుళ్లు, సన్నాయి, కాలీకోం వాయిద్యాలు, ఆటాపాటలు, ఆదివాసుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. భీం మనవడు సోనేరావ్, కుటుంబ సభ్యులు, ఆదివాసులతో కలిసి సంస్కృతీ సంప్రదాయాల నడుమ యోధుడి విగ్రహం, సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోనప్ప, సక్కు, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, కలెక్టర్లు రాహుల్ రాజ్, సిక్తా పట్నాయక్, ఎస్పీ సురేశ్‌కుమార్ హాజరై నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి అల్లోల మాట్లాడుతూ కుమ్రం భీం పోరాట పటిమ తెలంగాణకు స్ఫూర్తి అని, ఆయన చూపిన మార్గంలో గిరిజనులంతా నడిచి ప్రగతి సాధించాలని కోరారు. అతి త్వరలోనే పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచిన ఘనత సీఎంకే దక్కుతుందని కొనియాడారు.
మంచిర్యాల ప్రతినిధి /కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్/కెరమెరి, అక్టోబర్ 9 : అడవితల్లి ముద్దుబిడ్డ, ఆదివాసుల ఆరాధ్యదైవం కుమ్రం భీంకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం జోడేఘాట్‌లో భీం 82వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా, తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి అడవిబిడ్డలు, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోరుగడ్డ పరవశించింది. జోడేఘాట్ సమీప గ్రామాల గిరిజనులు కాలినడకన తరలిరాగా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్‌లలో చేరుకున్నారు. వర్ధంతి వేడుకలకు సుమారు 10 వేల మంది తరలిరాగా, జోడేఘాట్ ప్రాంతం జనసంద్రమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు జనం రావడం కనిపించింది. రూ. 25 కోట్లతో నిర్మించిన భీం స్మృతి చిహ్నం, కాంస్య విగ్రహంతో పాటు మ్యూజియంలో ఏర్పా టు చేసిన చిత్రాలు, కళాఖండాలను చూడడానికి జనం ఎగబడ్డారు. ముందుగా కుమ్రం భీం మనుమడు సోనేరావ్, వారసులు, వంశీయులు, ఆదివాసులు సంస్కృతీ సంప్రదాయ డప్పు, వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమం నిర్వహించి అమరవీరుల జెండాలను ఎగురవేశారు. అనంతరం భీం విగ్రహం, సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెర్సాపేన్, అవ్వాల్పేన్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. డప్పు, సన్నాయి, కాలీకోం వాయిద్యాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆదివాసుల నినాదాలతో హోరెత్తింది.
భీం వర్ధంతికి ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ కలెక్టర్లు రాహుల్ రాజ్, సిక్తా పట్నాయక్, పద్మశ్రీ కనకరాజు, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎస్పీ సురేశ్‌కుమార్, ఏఎస్పీ అచ్చేశ్వరరావు, మాజీ ఎంపీ నగేశ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ మోహన్రావ్, కన్వీనర్ రఘునాథ్, కుమ్రం సూరు మనుమడు కుమ్రం పాండు, ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, తహసీల్దార్ సాయన్న, సమీర్ అహ్మద్ ఖాన్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, డీఎంహెచ్‌వో ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు, 9 ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు తరలివచ్చి నివాళులర్పించారు.
భీం వర్ధంతి అనంతరం కుమ్రం సూరు వర్ధంతిని జోడేఘాట్‌లో అధికారికంగా నిర్వహించారు. సూరు మనుమడు కుమ్రం పాండు ఆధ్వర్యంలో కొలాం ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా నివాళులర్పించారు. ఆదివాసీ నాయకులతో పాటు అధికారులు సైతం హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొలాం గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలపై నృత్యాలు చేస్తూ సంబురాలు నిర్వహించారు.
కుమ్రం భీం 82వ వర్ధంతి సందర్భంగా దర్బార్ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రజలు, అధికారులు ఆసక్తిగా తిలకించారు. గోండి, తెలుగు భాషలో పాడిన పాటలు, గుస్సాడీ, డెంస్సా నృత్యాలు కనువిందు చేశాయి. గోండ్, ప్రధాన్, కొలాం, తోటి, నాయక్‌పోడ్, మొత్తం 9 తెగల ఆదివాసీలో తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతిని ప్రదర్శించారు.
సభకు వచ్చిన మహిళలు, పురుషులు, వీఐపీలు, పోలీసులు, మీడియాకు వేర్వేరుగా తాగునీరు, భోజన వసతి కల్పించారు. సుమారు 10వేలకు పైగా ప్రజలు తరలివచ్చారు. ఇబ్బందులు తలెత్తకుండా అందరికీ తగిన ఏర్పాట్లు చేశారు.
భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, కెనరా బ్యాంక్, పర్యాటక శాఖ(గిరిస్టాల్), హస్తకళాకారుల స్టాల్, వైద్య, ఆరోగ్యశాఖ శిబిరం, ఐసీడీఎస్ స్టాల్(చిరుధాన్యల పోషకాహారం), పురపాలక సంఘం కాగజ్‌నగర్, మత్స్యశాఖ, వెదురు వస్తువుల ప్రదర్శనశాలతో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేందుకు రెవెన్యూ శాఖ ద్వారా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు.
ప్రజా దర్బార్‌లో భీం ఉత్సవ సమితి సభ్యులు, ఆదివాసీ తెగలకు చెందిన నాయకులు పలు సమస్యలను మంత్రి ఐకే రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. టోకెన్ మోవాడ్ నుంచి జోడేఘాట్ వరకు, గుండా గ్రామం నుంచి ఆసిఫాబాద్ వరకు, జైనూర్ నుంచి తిర్యాణి వరకు నిర్మిస్తున్న రోడ్లకు అటవీశాఖ అనుమతులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. పీటీజీ తెగలకు చెందిన వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారికి విద్య, వైద్యంతో పాటు ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక స్థానం కల్పించాలని విన్నవించారు. జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేసి అందరి సమక్షంలో రుణాలు, పథకాలు అందించాలని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఆదివాసీలకు పెద్ద సమస్యగా మారిన జీవో నంబర్-3ను పునరుద్ధరించాలని కోరారు.
భీం వర్ధంతి సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ కే. సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హట్టి నుంచి జోడేఘాట్ వరకు రహదారి పొడువునా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు.