కడెం, అక్టోబర్ 9: కడెం ఆయకట్టు ద్వారా మరో 3 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. ఇప్పటికే కడెం ప్రాజెక్టు ద్వారా కడెంతో పాటు, దస్తురాబాద్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల వరకు 65 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా మరో మూడు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కడెం మండలంలో కొన్ని గ్రామాలకే నీరు అందుతున్నది. ఎత్తిపోతల పథకాలు నిర్మించి మరి న్ని గ్రామాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంలిఫ్ట్ నిర్మాణాలకు సానుకూలంగా స్పందిం చింది. కడెం ప్రాజెక్టు కింద మొత్తం ఏడు ఎత్తిపోతల పథకాలను నిర్మించడానికి అధికారులు ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం అంగీకరించింది. ఇందు లో మొదటగా కడెం వాగు కింద లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు రూ. 40.10 కోట్లు మంజూరు చేసింది. పనులు వేగంగా చేపట్టేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కడెం ఆయకట్టుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిం చి నీటిని అందించాలని ఇక్కడి ప్రజలు 25 ఏళ్లుగా కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా ఫలితం దక్కలేదు. లిఫ్ట్ నిర్మాణంతో లక్ష్మీపూర్తో పాటు, నవాబుపేట, కల్లెడ, దోస్త్‌నగర్, దస్తురాబాద్ మండలం ఆకోండపేట గ్రామాల్లో 3 వేలకు పైగా ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఈ ఐదు గ్రామాలకు చెరువులున్నా వర్షాధారంగానే పంటలు వేస్తున్నారు. కేవలం ఒక్క పంట, అది కూడా ఆరుతడి పంటలు మాత్రమే సాగవుతున్నాయి.
కడెం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ఇక్కడి రైతులకు సాగునీటిని అందించాలని పలుమార్లు ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆగస్టులో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎస్ సోమేశ్‌కుమార్ రూ. 40.10 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు క్లియర్ కావడంతో అధికారులు సర్వేలు పూర్తి చేశారు. కడెం ప్రధాన కాలువకు నిర్మించనున్న లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకం సామర్థ్యం. 0.23 టీఎంసీలు. దీంతో ఈ ఐదు గ్రామాల ప్రజలకు సాగునీటికి ఢోకా ఉండదు. దీంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఐదు గ్రామాలకు నీటిని అందించాలంటే తప్పనిసరిగా అటవీశాఖ అనుమతులు కావాలి. ఇవి కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాలు కావడంతో తప్పనిసరిగా అనుమతులు తీసుకొని పైప్‌లైన్ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటికే అధికారులు అటవీశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, అనుమతులు కోరారు. అటవీశాఖకు సైతం పరిహారంగా రూ. 10 లక్షల వరకు ఇచ్చి, పనులు పూర్తి చేయనున్నా రు. కాగా, ఈ విషయమై అటవీశాఖ, నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులు ఉమ్మడి సర్వేలు చేసి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎత్తిపోతల పథకం డీఈ హంజా నాయక్ తెలిపారు. మరో వారంలో అటవీశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు అందుతాయని, పనులు కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.