నిర్మల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో లంపీస్కిన్ వైరస్ వ్యాప్తిపై పశు వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే భైంసా, తానూర్, లక్ష్మణచాంద మండలాల్లో సుమారు 50 పశువుల్లో లక్షణాలు బయటపడడంతో వైద్యాధికారులు గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. యజమానులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, అధికారులను అప్రమత్తం చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అందులో భాగంగానే పశు వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో జిల్లా సరిహద్దుల్లో ఇరువైపులా పశువుల రవాణాను నిరోధించేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రింగ్ వ్యాక్సినేషన్ చేపట్టి వ్యాధి విస్తరించకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో 20వేల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. క్షేత్ర స్థాయిలో పశువులను సూక్ష్మంగా పరిశీలిస్తూ వ్యాధి లక్షణాలు ఉన్నవాటికి వెంటనే చికిత్స అందిస్తున్నారు. అలాగే పలు చోట్ల కొనసాగుతున్న పశువుల సంతలపై ఆంక్షలు విధించారు. వైరస్ తీవ్రత తగ్గే వరకు సంతలు నిర్వహించద్దని గ్రామాల్లోని వీడీసీలు, సర్పంచులు, అధికారులు ఇప్పటికే సూచించారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చాటింపు వేయిస్తున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో పశు మాంసం విక్రయాలపై కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు.