నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ జాతర వైభవంగా ముగిసింది. ఆదివారం వేకువజామునే భక్తులు తరలివచ్చి పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. నైవేద్యం వండి అమ్మవారికి సమర్పించారు. ఒడిబియ్యం, తులాభారం వంటి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ముందుగా దిలావర్పూర్ మండలంలోని సాంగ్వీ గోదావరి వద్ద అమ్మవారి నగలకు ఆలయ పండితులు అభిషేకం నిర్వహించారు. పోచమ్మ తల్లీ మమ్ముల్ని సల్లంగ సూడు అంటూ భక్తులు వేడుకున్నారు.
దిలావర్పూర్, అక్టోబర్ 2 : ‘సల్లంగ సూడు.. పోచమ్మ తల్లీ..’ అంటూ భక్తులు నినదించారు. అడెల్లి పోచమ్మ నగల శోభాయాత్ర ఆదివారం ఉదయం దిలావర్పూర్ మండలంలోని సాంగ్వీ గోదావరి వరకు సాగింది. అక్కడ అమ్మవారి నగలకు ఆలయ పండితులు అభిషేకం నిర్వహించారు. అక్కడే ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమైన అమ్మవారి నగల శోభాయాత్ర కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడెగాం గ్రామాల మీదుగా బయల్దేరింది. ఊరూరా అమ్మవారి నగలకు భక్తులు స్వాగతం పలుకుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దిలావర్పూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ భారీ బందోబస్తు నడుమ యువకులు నృత్యాలు చేశారు. శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. దిలావర్పూర్ ఎస్ఐ గంగాధర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, నిర్మల్ గ్రామీణ సీఐ వెంకటేశ్, సోన్ సీఐ రాంనర్సింహారెడ్డి, పలువురు ఎస్ఐలు, ప్రత్యేక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
సారంగాపూర్, అక్టోబర్ 2 : మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయం వద్ద శని, ఆదివారాల్లో గంగనీళ్ల జాతర ఘనంగా సాగింది. ఆదివారం వేకువ జామునే భక్తులు వివిధ వాహనాల్లో భారీ సంఖ్యలో తరలివచ్చి పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి క్యూలో నిలబడి పోచమ్మను దర్శించుకున్నారు. మహిళలు బోనాలు వండి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారికి ఒడిబియ్యం, తులాభారం తదితర మొక్కలు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం నుంచి ఆలయం, పరిసరాల్లో వెలిసిన దుకాణ సముదాయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవాదాయ శాఖ, ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోల నుంచి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపారు. సారంగాపూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
జాతరను పురస్కరించుకొని నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ వెంకటేశ్, ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి సారంగాపూర్ నుంచి అడెల్లి దేవస్థానం వరకు గట్టి బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి నగల వెంట కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం దిలావర్పూర్ మండలం సాంగ్వి గోదావరి తీరానికి తరలించిన అమ్మవారి నగలను గంగాజలంతో శుద్ధి చేశారు. ఆదివారం భక్తిశ్రద్ధలతో బీరవెల్లి, ప్యారమూర్, వంజర్, యాకర్‌పల్లి, సారంగాపూర్, అడెల్లి గ్రామాల మీదుగా వెళ్లి రాత్రి ఆలయానికి చేర్చారు. గ్రామాల్లో అమ్మవారి నగలకు డప్పుమేళాలు, మహిళల మంగళహారతుల మధ్య స్వాగతం పలికారు. మత్స్యకారులు ఆయా గ్రామాల్లో వల గొడుగుతో స్వాగతం పలికారు. నగలను ఆలయానికి చేర్చి అమ్మవారికి అందంగా అలకరించి ప్రత్యేక పూజలు చేయడంతో జాతర ముగిసింది. కాగా, అమ్మవారి నగలను ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రాజ్‌మహ్మద్, వంగ రవీందర్‌రెడ్డితో పాటు సీఐ వెంటేశ్వర్లు, ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి తలపై మోశారు.