ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మహిళలకు సర్కారు సారెను పంపిణీ చేశారు. నేతన్నలకు పని కల్పించడంతో పాటు మహిళలకు పండుగ కానుక అందించేందుకే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కానుకలు అందుకున్న మహిళలు మురిసిపోయారు.
నిర్మల్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మహిళలకు సర్కారు సారెను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకే పండుగ సారెగా బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బతుకమ్మ చీరల కోసం రూ.339 కోట్లు వెచ్చిస్తున్నదని వెల్లడించారు.
రాష్ట్రంలోని నేతకార్మికులకు పని కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఈ చీరల తయారీని వారికే అప్పగించినట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి విడుతలో జిల్లాకు 1.17 లక్షల చీరలు చేరుకున్నాయని, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో వస్తాయని చెప్పారు. వీటిని అన్ని రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉంచి పంపిణీ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మహిళలకు అన్ని విధాలా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మునుపటి కంటే ఈసారి చీరల డిజైన్లు చాలా బాగున్నయ్. సీఎం కేసీఆర్ ఆడపడుచులకు అందించే ఈ చిరు కానుక చాలా నచ్చింది. ఈ పండుగకు ప్రభుత్వం ఇచ్చిన చీరను కట్టుకుని బతుకమ్మ ఆడుతా. రంగురంగుల చీరలను మంచిగ తయారు చేసిండ్రు. పండుగ కానుక ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– ఏ రేఖ, వెంగ్వాపేట్
బతుకమ్మ పండుగకు మంచి చీరలు ఇచ్చిన సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు. ఆయన సల్లగుండాలి. కేసీఆర్ వచ్చిన తర్వాతే ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ కానుకతో పండుగ సంబురంగా జరుపుకుంటాం. పండుగకు రెండు రోజుల ముందే చీరలు ఇచ్చిండ్రు. మహిళల కు రంగురంగుల బతుకమ్మ చీరలు ఇవ్వడం గొప్ప విషయం.
– డీ సుజాత, చిట్యాల్
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సారు చేతుల మీదుగా బతుకమ్మ కానుక అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. పండుగ వచ్చిందంటే చీర కొనడానికి బాగా ఖర్చయ్యేది. ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ పుణ్యమా అని పండుగ పూట పేదింటి ఆడపడుచులకు చీరలకయ్యే ఖర్చులు ఆదా అవుతున్నాయి. సీఎం సారు సల్లగుండాలి. చీరల రంగులు, డిజైన్లు బాగున్నయి.
– గంగుబాయి, ఎల్లారెడ్డిపేట
నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. పుట్టింటి నుంచి వచ్చినట్లు సీఎం కేసీఆర్ ఏటా చీరను పంపుతుండు. ఈసారి చీరలు కలర్ఫుల్గా ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మహిళలను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని పండుగలను సమానంగా చూస్తున్నడు. బతుకమ్మ వేడుకలను ప్రభుత్వమే నిర్వహించడంతోపాటు ఆడ బిడ్డలకు సారె పెట్టిన కేసీఆర్ సారు అందరికీ పెద్ద దిక్కయిండు.
– ఏ అమృత, బుధవార్‌పేట్