– ఇన్పుట్స్ పంపిణీ చేసిన కేవీకే
రుద్రంపూర్, అక్టోబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు కింద రైతులకు శిక్షణ కార్యక్రమంతో పాటు సహజ వ్యవసాయ ఇన్పుట్స్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం కేవీకే ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు (టెక్నికల్), సహజ వ్యవసాయ ప్రాజెక్టు నోడల్ అధికారి శోభన్‌బాబు పాల్గొని ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ ఉత్పత్తులు, వాటి వినియోగం, ప్రాజెక్టు లక్ష్యాలు, చేపడుతున్న కార్యకలాపాలను రైతులకు వివరించారు.
కేవీకే భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డా. టి.భరత్ మాట్లాడుతూ సహజ వ్యవసాయం ప్రాధాన్యతను వివరించారు. స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సమగ్ర నేల ఆరోగ్య నిర్వహణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సహజ పద్ధతుల ద్వారా సాగు చేయడం వల్ల నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు వ్యవసాయాన్ని మరింత స్థిరంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలో కీలకంగా ఉపయోగించే జీవామృతం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకున్నారు. అనంతరం పలువురు రైతులు తాము సహజ వ్యవసాయంలో అనుసరిస్తున్న పద్ధతులు, ఎదురైన అనుభవాలు, సాధించిన విజయాలను ఇతర రైతులతో పంచుకున్నారు.
కార్యక్రమం ముగింపులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 20 మంది ప్రకృతి వ్యవసాయ రైతులకు ఇన్పుట్స్ పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయంలో అవసరమైన ఉత్పత్తులను రైతులే తయారు చేసుకుని వినియోగించేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డ్రమ్స్, పప్పుల పొడి, వేపనూనె, బెల్లం తదితరాలను అందజేశారు.

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ