– సింగరేణి కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ గళం
రుద్రంపూర్, అక్టోబర్ 05 : కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. సోమవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్స్ వద్ద వినతిపత్రాలు సమర్పించారు. దానిలో భాగంగానే కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాలో వినతిపత్రాలు సమర్పించారు, ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు 40 శాతం లాభాల వాటాను ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి అభివృద్ధికి, బొగ్గు ఉత్పత్తికి కార్మికులు అందిస్తున్న సేవలు కీలకమని ఏఐటీయూసీ పేర్కొంది. కార్మికుల శ్రమతో సంస్థకు లాభాలు వస్తున్నప్పుడు ఆ లాభాల్లో కార్మికులకు తగిన వాటా అందించడం యాజమాన్యం బాధ్యత అన్నారు. గతంలో కొనసాగుతున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గుర్తింపు పొందిన కార్మిక సంఘంతో చర్చించి లాభాల వాటాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో ఉత్పత్తికి, కార్మికుల రక్షణకు అవసరమైన మెటీరియల్, పరికరాల కొరత ఏర్పడుతున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. మెటీరియల్ కొనుగోలుకు నిధుల కొరత ఉందని యాజమాన్యం పేర్కొంటున్న పరిస్థితి ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు కార్మికుల ప్రాణ రక్షణకు అవసరమైన పరికరాలు, మెటీరియల్ను తక్షణమే అందుబాటులోకి తేవాలని కోరారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కార్మికులకు చెల్లించాల్సిన పండుగ అడ్వాన్స్, లాభాల వాటా, దీపావళి బోనస్, పి.ఎల్.ఆర్.ఎస్. వంటి ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. చెల్లింపుల్లో జాప్యం జరిగితే కార్మికులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.

40 శాతం లాభాల వాటా ప్రకటించడంలో జాప్యమెందుకు?
సింగరేణికి తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సంస్థల నుంచి సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు ఏఐటీయూసీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఆ బకాయిలను వెంటనే సింగరేణికి ఇప్పించాలని కోరింది. బకాయిలు అందితే సంస్థ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంతో పాటు ఉత్పత్తి, రక్షణకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేయడానికి, కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు ఎస్.వి.రమణమూర్తి, జక్కుల గట్టయ్య, ఉపాధ్యక్షులు కత్తెర్ల రాములు, క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బ్యారర్స్ గుమ్మడి వీరయ్య, హీరాలాల్, హుమాయూన్, ఎస్ నాగేశ్వరరావు, నాగయ్యా, నితిన్, పిట్ కార్యదర్శిలు భుక్య రమేష్, మధు కృష్ణ, కమల్, సురేందర్, మెంగన్ రవి, కోటి, నరేష్, సుధీర్, అనంతలక్మి, రమేష్, మల్లికార్జున్, శ్యాం కిరణ్, నాయకులు రామచందర్ సందీప్, సాయిపవన్, మురళి, ఓదెలు, శ్రీనివాస్, అవినాష్, రాజాలపూడి సాంబమూర్తి, రమేష్, కరుణాకర్, గుమ్మడి మురళి, సురేందర్ రెడ్డి, కుమార్ రావు, సందీప్ పాల్గొన్నారు.