దస్తురాబాద్, డిసెంబర్ 9:నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామ సమీపంలో 5 జూలై 2015న మొదటి విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా హరితవనానికి అటవీ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఖాళీగా ఉన్న 160 ఎకరాల్లో నాడు సుమారు లక్ష మొక్కలు నాటారు. వీటిని పెంచే పనుల్లో గ్రామస్తులకూ భాగస్వామ్యం కల్పించారు. రావి,జువ్వి, నీలగిరి, వెదురు, చింత, నేరేడు, ఉసిరి, మారేడు, వేప మొక్కలు నాటారు. ఆరేండ్లలో ఇవి పెరిగి మహా వృక్షాలుగా మారాయి.
కృషికి దక్కిన ఫలితం..
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు స్థానిక అటవీ శాఖ అధికారులు కృషి చేశారు. దీంతో కేసీఆర్ హరితవనం పచ్చదనంతో నిండిపోయింది. మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చనిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలను పెట్టి నీటిని అందించారు. ఇప్పుడు చిట్టడివిలా మారి అటవీ అధికారుల శ్రమ, కృషికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది.
వన్యప్రాణులకు ఆవాసంగా..
ప్రస్తుతం కేసీఆర్ హరితవనం వన్యప్రాణులకు ఆవాసంగా మారింది. అటవీ శాఖ అధికారులు నీటి వనరులు ఏర్పాటు చేడయంతో జింకలు, దుప్పులు, నెమళ్లు, కోతులు, అడవి పందులు, కుందేళ్లు , వివిధ రకాల పక్షులు, ఇక్కడి వచ్చి ఆవాసంగా మార్చుకున్నాయి.
కేసీఆర్ హరితవనంగా..
లక్ష మొక్కల క్షేత్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్తో కలిసి అటవీ, దేవాదాయ శాఖ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గతేడాది సందర్శించారు.ఈ క్షేత్రానికి కేసీఆర్ హరితవనంగా నామకరణం చేసి బొటానిక్ గార్డెన్గా తీర్చుద్దుదాతామని ప్రకటించారు. ఇటీవల మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రేఖా నాయక్ కేసీఆర్ హరితవనంగా నామకరణం చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.
ఐరాస విభాగం ప్రసంసలు..
కేసీఆర్ హరితవనాన్ని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ప్రతినిధులు ప్రశంసించారు. పచ్చదనం పెంచడంతో పాటు వన్యప్రాణులకు ఆవాసంగా మార్చడాన్ని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలె హెమ్ ట్విట్టర్ వేదికగా అటవీ శాఖ అధికారులను అభినంధించారు.
హరితవనం సంరక్షణకు కృషి చేస్తున్నాం..
ఖాళీ ప్రదేశాన్ని అందరి సహకారంతో సంరక్షిస్తున్నాం. హరితహారం మొదటి విడుతలో భాగంగా నాటిన మొక్కలు ఆరేండ్లలో ఏపుగా పెరిగి చిట్టడివిగా మారడం చాలా సంతోషంగా ఉంది. దట్టంగా పెరిగిన ఈ వనంలో జింకలు, నీలుగాయిలు, అడవి పందులు, కుందేళ్లు, తదితర జంతువులు, పక్షులు వచ్చి సందడి చేస్తూ ఆవాసంగా మార్చుకున్నాయి. జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. కేసీఆర్ హరితవనం సంరక్షణకు కృషి చేస్తున్నాం. ఈ కేసీఆర్ హరితవనాన్ని మరింత అభివృధ్ధి చేస్తాం.