నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 16 : జాతీయ సమైక్యతను చాటేందుకే రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్మల్‌లోని శివాజీ చౌక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశ చరిత్రలో సెప్టెంబర్ 17 చిరస్మరణీయమైన రోజన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆలస్యంగా స్వేచ్ఛను సాధించిందన్నారు.
రాష్ట్ర ప్రజలు సగర్వంగా గర్వపడేలా తలెత్తుకొని జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుకోవడంతో పాటు భావి తరాలకు ఈ రోజు విశిష్టతను తెలియజేయాలన్నారు. అనంతరం త్రివర్ణ బెలూన్లతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మీ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, 15వేల మంది విద్యార్థులు, అధికారులు, ప్రజలు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రధాన వీదుల గుండా నిర్వహించిన ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగింది. అక్కడ విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సామూహిక జాతీయ గీతాలాపాన చేశారు.
దిలావర్పూర్, సెప్టెంబర్ 16 : మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని సాంగ్వీ సమీపంలోని శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో చేపపిల్లలను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్నట్లు చెప్పారు.
శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో ఈ ఏడాది 62 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పాల్దే అక్షర, నాయకుడు అనిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణా రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్ రావు, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, మండల కో ఆప్షన్ సభ్యుడు అన్వర్‌ఖాన్, సర్పంచ్‌లు అచ్యుత్‌రావు, గంగారెడ్డి, తిరుమల శ్రీనివాస్, ఓడ్నం సవిత , ఎంపీటీసీలు పోల జయసుధ, నాయకులు స్వామిగౌడ్, గంగారెడ్డి, యు. ఫణింధర్ రావు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.