బోథ్, సెప్టెంబర్ 12: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు జోరుగా వర్షం కురిసింది. బోథ్‌లో 133 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని ధన్నూర్(బీ), మర్లపల్లి, సొనాల, పెద్దగూడ గ్రామాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. ధన్నూర్(బీ) వాగు వంతెనపై నుంచి వరద పారడంతో నాగాపూర్, జైనూర్పల్లె, ధన్నూర్(బీ), దర్బాతండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు గంటల తరబడి వాగు వంతెన వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లోని భూముల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో పత్తి, సోయా, కంది, కోతకు చేరుకున్న పెసర, మినుము పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
భీంపూర్, సెప్టెంబర్ 12 : ఎగువ మహారాష్ట్ర నుంచి వరద వచ్చి చేరుతుండడంతో పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. కరంజి(టీ), టేకిడిరాంపూర్ గ్రామాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గుబ్‌డి , టేకిడిరాంపూర్, కొజ్జన్గూడ గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ – కరంజి(టీ), అందర్‌బంద్ రూట్లలో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నార్నూర్, సెప్టెంబర్ 12 : నార్నూర్, గాదిగూడ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఖడ్కి, లోకారి(కే) కల్వర్టుల వరద ప్రవాహంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కునికసా, బారిక్రావ్గూడ, మారుగూడ, దన్నుగూడ గ్రామస్తులు వాగులు దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
గుడిహత్నూర్, సెప్టెంబర్ 12 : మండలంలోని ధమన్గూడ, సీతాగొంది, శంభుగూడ గ్రామాల్లోని చెరువులకు వరద రావడంతో నిండుకుండలా కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతకాలనీలకు వరద చేరింది.
బేల, సెప్టెంబర్ 12 : మండలంలోని దహిగాం, మణియార్‌పూర్ గ్రామాల శివారులోని లోవెల్ వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే సాంగిడి, బెదోడలో గల పెన్‌గంగలో నీరు ప్రవహించడంతో గ్రామస్తులను పంచాయతీ అధికారులు అప్రమత్తం చేశారు. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.