నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : వినాయకుడి దయతో విఘ్నాలన్నీ తొలగి ప్రజలందరూ విజయాలు పొందాలని, ప్రజలంతా సుఖసంతోషాలకు కలగాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట్ 1, 2, 3,4, ఎస్సీ కాలనీల్లోని గణేశ్ మండపాల్లో పూజలు చేశారు. బుధవార్‌పేట్ ఒకటో గణపతి వద్ద మంత్రి ఇంద్రకరణ్ కొబ్బరికాయ కొట్టి శోభయాత్రను ప్రారంభించారు. అనంతరం బ్యాండ్‌మేళాలు వాయించి గణపతి బొప్పా మోరియా.. అంటూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పండుగ నిర్వహించినా సంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకుడు అయ్యన్నగారి భూమయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ చీఫ్ విప్ నేరెళ్ల వేణు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీ శ్రీనివాస్, పూదరి రాజేశ్వర్ పాల్గొన్నారు.
గణేశ్ శోభాయాత్ర ప్రారంభించిన సమయంలో భారీ వర్షం కురుస్తున్నా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతి వినాయకుడి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మండపాల నిర్వాహకులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శోభాయాత్ర కొనసాగించారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్, డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి గణేశ్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. కార్యక్రమంలో నాయకులు పతికె రాజేందర్, ముప్పిడి రవి, బద్రి శ్రీనివాస్ ఉన్నారు.
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 9 : పట్టణంలో శుక్రవారం గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని బుధవార్‌పేట్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పాతబస్టాండ్, వివేకానంద చౌక్, రూరల్‌పోలీస్ స్టేషన్, నగరేశ్వర వార్డు, నిషాన్, కస్బా, ద్యాగవాడ, మార్కెట్, గాంధీచౌక్, సోమవార్‌పేట్, నాయుడివాడ, బంగల్పేట్ మీదుగా వినాయక్ సాగర్ వరకు సాగింది. శోబాయాత్రలో ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఏఎస్పీ, ఐదుగరు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 450 మంది కానిస్టేబుళ్లు, సాయుధ దళ పోలీసులు విధులు నిర్వహించారు.అడుగడుగునా సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. మూడు డ్రోన్ కెమెరాలతో నిఘా చేపట్టారు. ప్రార్థన మందిరాలు, దేవాలయాల వద్ద సీసీ కెమరాలు, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ శోభాయాత్ర పర్యవేక్షించారు.