ఎదులాపురం,ఆగస్టు 30: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక చర్యలు తీసుకుటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ను మంగళవారం తనిఖీ చేశారు. రిమ్స్‌లోని పిల్లలవార్డు ,గైనకాలజీ విభాగాలను సందర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గతవారం రిమ్స్ వైద్యశాలను పరిశీంచామని, వైరల్ ఫీవర్ కారణంగా మరిన్ని వార్డులను ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు వైద్య సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి జ్వర బాధిత పిల్లలకు వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. రోజు వారీ రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మరింత మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గర్భిణులకు ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసకుంటున్నామని తెలిపారు. గైనకాలజీ వార్డులో బాలింతలతో కలెక్టర్ మాట్లాడారు. వారి ఆరోగ్య విషయాలపై అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రోజు వారి ప్రసవాల సంఖ్య, తదితర విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. .
మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో మట్టి వినాయకుల పంపిణీని ప్రారంభించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ హితానికి మట్టి వినాయకులను పూజించాలని కోరారు. రాష్ట్రంలో వినాయక విగ్రహాల ఏర్పాటులో ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉందని స్థానిక అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు రామకృష్ణ, తొడసం చందు డీబీసీడీవో రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.