నిర్మల్(నమస్తే తెలంగాణ)/ఎదులాపురం, ఆగస్టు 28: ఆయన ఓ పత్రిక, చానల్‌కు యజమాని. ఈ తెలుగు రాష్ర్టాల్లో నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనే బ్రమలో బతికే మనిషి. నేను రాసిందే రాత.. నేను చెప్పిందే మాట అనే వ్యక్తి. ఆయనకు నచ్చిన వారు బాహుబలిలా కనిపిస్తే.. నచ్చని వారిపై ‘కలం’ దువ్వుతాడు. ఎన్ని కథలైనా సూత్రీకరిస్తాడు. డిబేట్లు పెట్టి విమర్శిస్తాడు. ఈ క్రమంలో శనివారం ఆయన చానెల్లో ఎమ్మెల్సీ కవితతో డిబేట్ నిర్వహించాడు. నమస్తే తెలంగాణ పత్రికను అవహేళన చేస్తూ మాట్లాడాడు. దళితబంధును వ్యతిరేకిస్తూ వాదనకు దిగాడు. రూ.10 లక్షలు ఎందుకియ్యాలంటూ కుసంస్కారాన్ని బయటపెట్టాడు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటూ అడ్డంగా మాట్లాడాడు. సంక్షేమ పథకాలు ఉచితాలంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ, మోదీకి తొత్తుగా మాట్లాడుతూ.. ఉచితాలకు ఓట్లు రాలవంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. వీటన్నింటిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా తిప్పికొట్టారు. కాగా.. ఆ యజమానిపై దళితులు, దళితసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూసుకెళ్తున్నది. రైతన్నల కోసం రైతుబంధు, రైతుబీమా.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ అమలు చేస్తున్నది. వీటితోపాటు సబ్బండ వర్గాలకు అనేక పథకాలు అమలు చూస్తూ.. దళితుల బాగు కోసం కూడా దళితబంధు కింద ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్నది. ఇక, నమస్తే తెలంగాణ పత్రిక ప్రజల ఆదరాభిమానాలు చూరగొని దిగ్విజయంగా నడుస్తున్నది. దళితబంధు, సంక్షేమ పథకాలు, నమస్తే తెలంగాణపై ఓ చానల్ యజమాని తన అక్కసును వెల్లగక్కాడు. ఎమ్మెల్సీ కవితతో వాదనకు దిగాడు. ప్రగతిపథంలో దూసుకెళ్తూ, దేశానికే మోడల్‌గా నిలుస్తున్న కేసీఆర్ పాలనపై తప్పుడు కూతలు కూశాడు. బీజేపీకి, మోదీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ.. ఉచితాలకు ఓట్లు రాలవంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని అవహేళన చేశాడు. దళితులకు రూ.10 లక్షలు ఎందుకియ్యాలంటూ వాదనకు దిగాడు. ఎక్కడి నుంచి తెస్తారంటూ మండిపడ్డాడు. మనసులోని విషపు భావాలను, కుసంస్కారాన్ని బయటపెట్టాడు. ఉచితాలకు ఓట్లు రాలవు అంటూ బీజేపీ, నరేంద్ర మోదీకి తొత్తుగా వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు పథకాలు, అభివృద్ధితో పాటు ‘నమస్తే తెలంగాణ’ పత్రికను ఎమ్మెల్సీ సమక్షంలోనే అవహేళన చేశారు. ఆయన వాదనను కవిత తీవ్రంగా తిప్పికొట్టింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, దళితుల సాధికారత, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సర్కారు పనిచేస్తుంటే.. ఇష్టారీతిన మాట్లాడడంపై దళితులు, దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
స్వరాష్ట్రంలో దళితులకు పెద్దపీట
ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్వరాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, రైతుబీమా, రైతుబంధు ఇలా 400లకుపైగా పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులా ముందుకు తీసుకెళ్తూ స్వరాష్ట్రంలో సపరిపాలన అందిస్తున్నారు. దళితుల కోసం భూమిలేని నిరుపేదలకు దళితబస్తీ కింద మూడెకరాల భూమి ఇచ్చాడు. వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం, విద్య అందిస్తూ అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తున్నాడు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహక పథకం కింద రూ.2.50 లక్షలు అందిస్తున్నాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్, కార్పొరేట్ కాలేజీ, అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం (ఏవోవీఎన్) కింద నిధులు అందజేస్తున్నాడు. దళితుల ఉద్దరణ కోసం దళితబంధు అమలు చేస్తున్నాడు.
మంచిర్యాల జిల్లాలో దళితబంధు పథకం కింద 251 మందికి రూ.23 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాడు. దళితబంధు పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
నిర్మల్ జిల్లాలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున జిల్లావ్యాప్తంగా 261 మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేశారు. వీరిలో 238 మందికి రూ.23.80 కోట్లు వెచ్చించి వారు కోరుకున్న యూనిట్లను పంపిణీ చేశారు. వీటిలో వాహనాలు, హార్వెస్టర్లు, జేసీబీ యంత్రాలను పంపిణీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 249 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.21.65 కోట్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు, మేకలు, మినీ వ్యాన్లు, ఇతర యూనిట్లను అధికారులు పంపిణీ చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 170 యూనిట్లు మంజూరు కాగా.. రూ.17 కోట్లు వెచ్చించారు.
దళితులపై అక్కసు ఎందుకో..
కోటపల్లి, ఆగస్టు 28: కూలీ చేసుకొని బతికే నాకు దళితబంధు దారి చూపింది. కాయాకష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తు న్న. దళితబంధు ద్వారా నాకు ఓ దారి దొరికినట్లయ్యింది. మా అసొంటి గరీబోళ్లకు కేసీఆర్ సర్కారు అండగా ఉంటున్నది. అడగకుండానే నన్ను తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద ఎంపిక చేసి రూ.10 లక్షలు మంజూరు చేసింది. ట్రాక్టర్‌ను అందచేసిండ్రు. ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్, ట్రాలీ, వ్యవసాయ పరికరాలతో గర్వంగా బతుకుతున్న. నాకు ఉన్న ట్రాక్టర్‌ను వ్యవసాయ పనులను, ఇతర కిరాయిలకు పంపిస్తూ రోజుకు ఖర్చులు పోను రూ.500 నుంచి 1000 సంపాదిస్తున్న. తిండికే తిప్పలయిన మా లాంటి వాళ్లకు కేసీఆర్ సారు అందించిన దళితబంధు సాయాన్ని మరిచిపోలేను. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మా స్థానిక నాయకులకు రుణపడి ఉంట. దళిత బంధు, సంక్షేమ పథకాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆ చానల్ వారికి దళితులపై అక్కసు ఎందుకో అర్థమైతలేదు. దళితబంధు ఎందుకని అనడాన్ని ఖండిస్తున్నం.
– అంబాల బాపు, వెంచపల్లి, దళిత బంధు లబ్ధిదారుడు, కోటపల్లి మండలం
నా తలరాతే మారింది..
లక్షెట్టిపేట, ఆగస్టు28 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంతో నా తలరాతే మారిపోయింది. గతంలో నాకే తిండికే కష్టమ య్యేది.. మరో నలుగురికి పని కల్పిస్తానని కలలో కూడా ఊహించలేదు. నా భర్త చనిపోయాక నేను కూలీ పని చేసుకొని ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ కుటుంబాన్ని వెల్లదీస్తున్న. దళితబందు పథకంలో సీఎం కేసీఆర్ సార్ నాకు పది లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. వాటితో డెయిరీ ఫాం పెట్టుకున్న. కూలీ పని మానేసి నేను కూడా ఇక్కడే పనిచే స్తున్న. మరో నలుగురికి పని ఇచ్చి వాళ్ల కుటుంబాలకు కూడా చేదోడు వాదోడుగా ఉంటున్న. శానా ఆనందంగా ఉంది. మా లాంటి దళితుల ఆర్థిక స్వావలంబనకు ప్రవేశపెట్టిన పథకంపై ఓ చానళ్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడినట్లు ఇనవడుతున్నది. కేసీఆర్ సార్ దళితుల కోసం ఎన్నో పథకాలు పెట్టిండు. ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ, మోదీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఆ ఛానల్ వాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతరు.
– దుంపల భాగ్య, దళితబంధు లబ్ధిదారురాలు, రంగంపేట, లక్షెట్టిపేట మండలం
దళిత బంధుపై విమర్శలు సరికాదు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దళితబంధు పథకం ప్రవేశపెట్టిన్రు. గతంలో ఇలాంటి మంచి ఆలోచన ఏ ఒక్కరూ చేయలే. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలపై కారుకూతలు సరికాదు. దళితబంధు మీద నిన్న ఓ చానల్లో దారుణంగా మాట్లాడిన్రు. దళితుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన వారికి గుణపాఠం తప్పదు. నేను ఇంత కాలం కారు డ్రైవర్‌గా పనిచేసిన. ఇప్పుడు దళితబంధు సొంతంగా కారు కొనుక్కున్న. ఆర్థికంగా నాకో ఉపాధి దొరికింది. నా కుటుంబానికి కొండంత భరోసా వచ్చింది. నాతో పాటు ఎంతో మందికి ఇలా ఒక ఉపాధినిచ్చిన పథకం దళితబంధు. పేదోళ్లకే తెలుస్తది ఈ పథకం విలువ. ఏసీల కూసొని మాట్లాడితే సరిపోదు. -ఇప్పస్వామి, కర్జపల్లి, సిర్పూర్-టి
మా జీవితాలు బాగు పడ్డాయి..
మాది నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి. పేద దళిత కుటుంబాలకు చెందిన మాకు దళితబంధు పథకం కింద ముగ్గురికి కలిపి దాదాపు రూ.30 లక్షలకు పైగా విలువ చేసే జేసీబీని తెలంగాణ సర్కారు అందించింది. నాతోపాటు గ్రామానికి చెందిన చిర్ర పోసాని, చిర్ర ముత్తవ్వలకు కేటాయించారు. జేసీబీని నడిపేందుకు ఒక ఆపరేటర్‌ను పెట్టుకున్నాం. రోజూ కిరాయికి పంపుతున్నాం. గంటకు రూ.1200 చొప్పున ఇస్తున్నారు. రోజులో 5 నుంచి 6 గంటలు పనిదొరుకుతున్నది. పని ఉన్న రోజు ఖర్చులు పోను రూ.5 వేలు మిగులుతున్నాయి. ఇలా నెలకు లక్షకు పైగా ఆదాయం వస్తున్నది. దీనిని ముగ్గురం కలిసి పంచుకుంటున్నాం. దళితబంధు ద్వారా మా జీవితాలు బాగుపడ్డయి. గతంలో కూలీ పనులకు మనుషులు కావాలంటే మా దళితుల వద్దకే వచ్చేవారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ మాలాంటి పేదలు కూడా సగర్వంగా బతికేలా అవకాశం కల్పించారు.
– చిర్ర నారాయణ, జేసీబి లబ్ధిదారు, ఎల్లపెల్లి.
ట్రాక్టర్ తో ఆదాయం పొందుతున్న…
ఎదులాపురం, ఆగస్టు 28:ఆదిలాబాద్ మండలం చిచ్ధరిఖానాపూర్కు చెందిన కాంబ్లే నితిన్ డిగ్రీ వరకు చదివాడు. చిన్న రైతుకుటుంబం. చేనులో పంటలకు దుక్కులు, కలుపు పనులు తదితరాల కోసం బాగా పెట్టుబడి అయ్యేది. చేతి నిండా పనిలేక స్వయం ఉపాధికి ఎదురు చూశాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వీరికి దళితబంధు కింద రూ.13 లక్షల విలువైన ట్రాక్టర్ అందజేసింది. అదనంగా బ్యాంకులో రూ.1 లక్ష జమ చేశారు. దీంతో సొంత చేనులో దుక్కు పనులు చేసుకుంటూనే, ఇతర రైతుల చేలల్లో ట్రాక్టర్‌తో పనులు చేస్తూ ఆదాయం పొందుతున్నాడు. గత మేలో వీరికి ట్రాక్టర్ ఇవ్వగా, నెలకు కనీసంగా రూ.20 వేలు సంపాదిస్తున్నాడు. డిగ్రీ చదివినా తనకు ఉద్యోగం లేదన్న బాధ లేదని, నితిన్ ధీమాగా చెబుతున్నాడు. సీఎం కేసీఆర్ మమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా నిలబెట్టారని కృతజ్ఞతతో చెప్పాడు .
– కాంబ్లే నితిన్ ,లబ్దిదారు , చిచ్‌ధరి ,ఆదిలాబాద్ మండలం
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటం..
నేను రోజూ కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేటోన్ని. తెలంగాణ సర్కారు దళితబంధు కింద నాకు ట్రాక్టర్ మంజూరు చేసింది. నేను ట్రాక్టర్‌కు యజమానిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఇదంతా కూడా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. మా ఊరోళ్లు నా వద్దకు వచ్చి దుక్కి దున్నేందుకు పిలుస్తున్నరు. కొందరైతే ముందుగానే బుక్ చేసుకుంటున్నరు. రోజూ అన్ని ఖర్చులు పోనూ రూ. 1000 నుంచి రూ.1500 వరకు మిగులుతున్నయి. ఎవుసం పనులే కాకుండా కంకర, మొరం, ఇసుక జారకొట్టడానికి కూడా కిరాయికి పోతున్న. దాదాపు నెలకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదిస్తున్న. గతంలో నేను, నా భార్య కూలీ పనులు చేసుకుంటూ రోజూ రూ.500 కూడా గిట్టుబాటు కాకపోయేవి. దళితబంధు పథకంతో మా దరిద్రం దూరమైంది.
– సారంగ చిన్నయ్య, లబ్ధిదారుడు, సాకెర.
దళిత వ్యతిరేకి..
ఓ చానల్ యజమాని దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా తన పత్రికలో సంపాదకీయాలు ప్రచురించాడు. ఇప్పుడు దళితబంధు పథకంపై తన అక్కసు వెల్లగక్కుతున్నాడు. ఇంత మంచి పథకం దేశంలో ఎక్కడా లేదని గుర్తించడం లేదు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున సాయం అందగా.. త్వరలోనే అసెంబ్లీ సెగ్మెంట్లో 1,500 మందికి పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన మరచినట్టున్నాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. దళితుల గురించి పట్టించుకున్న నాథుడు లేడు. సీఎం కేసీఆర్ వల్లే దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు. దీనిని జీర్ణించుకోలేని వారు తప్పుడు కూతలు కూస్తున్నారు. దళితబంధుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోం..
– ముడుసు సత్యనారాయణ, తెలంగాణ దళిత ఐక్యచైతన్య సదస్సు జిల్లా అధ్యక్షుడు.