బేల, ఆగస్టు28 : దేశంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని వక్తలు సాయిరాం మహారాజ్, హజ్రత్ ముఫ్తీ మహమ్మద్ హరున్ నద్వీ సాహెబ్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం సర్వమత సద్భావన సమ్మేళనం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్, శివాజీమహారాజ్, గాడ్గేబాబా, మహాత్మా జ్యోతిబాపూలే, కుమ్రం భీం విగ్రహాలకు పూల మాలలు వేశారు. అనంతరం మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో సాయిరామ్ మహారాజ్ మాట్లాడారు. మతం అంటే మానవత్వమని పేర్కొన్నారు. భగవంతుడు కేవలం మానవుడు, జీవరాశులను మాత్రమే సృష్టించాడన్నారు.
ఎవరు ఆపదలో ఉన్న ఆదుకోవడమే మానవత్వమని చెప్పారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొనానరు. దేశంలో శాంతిని నెలకొల్పడానికి ఇలాంటి సద్భావన సమ్మేళనలు నిర్వహించాల్సి ఆవశ్యకత ఎంతగానో ఉందని హజ్రత్ ముఫ్తీ మహమ్మద్ హరున్నద్వీ సాహెబ్ అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలని కోరారు. బేలలో నిర్వహించిన సర్వమత సద్భావన సమ్మేళనం అందరికీ మార్గదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
తోటి వారికి సాయం చేయకుండా, దేవుడికి ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమేనని పేర్కొన్నారు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే వారి కులం, మతం ఆలోచించవద్దన్నారు. అంతకు ముందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, నాయకులు గంభీర్‌ఠాక్రే, సతీశ్ పవర్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్ వారిని సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు మస్కేతేజ్రావు, గణేశ్, దత్తనిక్కం, రూప్‌రావు, రాందాస్ నాక్లే, తన్వీర్ ఖాన్, మౌలా నా మహమ్మద్ నియాజ్ అహ్మద్ ఖాస్మీ సాహెబ్, ఏజాజ్, జక్కుల మధుకర్, ప్రమోద్‌రెడ్డి, గోడే మధుకర్, ఫయాజుల్లాఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.