భీమారం, ఆగస్టు 27 : మంచిర్యాల – చెన్నూర్ జాతీయ రహదారిలోని భీమారం కలప డిపో నుంచి జోడువాగుల వరకు (2 కిలోమీటర్లు) నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో కల నెరవేరబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 2017లో రూ. 163.80 కోట్లతో జైపూర్ మండలం రసూల్పల్లి నుంచి కోటపల్లి మండలం అర్జున్గుట్ట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, భీమారం కలప డిపో నుంచి జోడు వాగుల వరకు మాత్రం అటవీశాఖ అనుమతులు రాక పనులు ఆగిపోయాయి. ఈ ఏడాది జూలై ఒకటిన జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ రహదారి పరిధి మధ్యలోనున్న జోడు వాగులపై కొత్తగా బ్రిడ్జి నిర్మించనుండగా, పదేళ్ల కల నెరవేరబోతున్నది.
విప్ సుమన్ చొరవతో..
అటవీశాఖ అనుమతుల కోసం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రంగా కృషి చేశారు. అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ప్రస్తుతం అనుమతులు లభించడంతో పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పూర్తికానుండగా, ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గొప్ప విషయం
గతంలో చెన్నూర్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాయకుడే లేకుండే. ఇప్పుడు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నాలుగు వరుసల రహదారికి అనుమతులు తీసుకురావడం గొప్ప విషయం. జోడు వాగుల వద్ద బ్రిడ్జి నిర్మించడం వల్ల రవాణాకు ఇబ్బంది ఉండదు. – సుంకరి భూమేశ్, భీమారం
గతంలో పట్టించుకోలే..
ఇది వరకు చెన్నూర్తో పాటు పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం పోవాలంటే మాకు పట్టపగలే సుక్కలు కనిపించేవి. జోడు వాగుల వద్ద బ్రిడ్జి లేక ఎంతో తిప్పలయ్యేది. ఇప్పుడు రహదారితో పాటు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే చాలా సౌకర్యంగా ఉంటుంది. గత పాలకులెవ్వరూ ఈ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. విప్ సుమన్ చొరవతో కేవలం మూడున్నరేళ్లలోనే మా కల నెరవేరబోతున్నది.
– నీలాల లక్ష్మి, బూర్గుపల్లి
విప్ వల్లే అనుమతులు
విప్ బాల్క సుమన్ వల్ల ఎన్నడూలేనంతగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది. భీమారంలో ఇప్పటికే నాలుగు వరుసల రహదారి నిర్మించారు. వీధి దీపాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాల్లో టైల్స్ కూడా వేయించారు. జోడు వాగుల వద్ద బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇప్పుడు విప్ వల్ల అటవీశాఖ అనుమతులు వచ్చాయి. ఈ ప్రాంత ప్రజల సమస్య తీరినట్లే. – చెఱుకు దీపికా రెడ్డి, భీమారం ఎంపీపీ