ఆడబిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ.. పుట్టినింట.. మెట్టినింట బతుకమ్మ ఆడుతూ ఆనందాన్ని పంచుకోనే వేడుక.. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అతివలను గౌరవిస్తూ ఏటా పండుగకు ముందుగానే సారె అందిస్తున్నది. ఈ ఏడాది కూడా 17 రంగులు.. 17 డిజైన్లతో కలిపి. 289 వెరైటీలతో ఇప్పటికే చీరెలను సిద్ధం చేయించింది. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలింపును మొదలు పెట్టింది. వచ్చే నెల నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా వీటిని అందించే ప్రక్రియను అధికార యంత్రాంగం ప్రారంభించనుంది.18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ ఈ కానుకను అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సుమారు 9 లక్షల మందికి ఈ చీరెలు పంపిణీ చేయనున్నది.
నిర్మల్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): దసరాను పురస్కరించుకొని ఈ ఏడాది కూడా ఆడబిడ్డలకు కానుకగా చీరెలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. 18 ఏండ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేసేలా అధికార యంత్రాంగం సిద్ధ్దమవుతున్నది. ఈ మేరకు రేషన్ కార్డులో 18 ఏళ్లు నిండిన మహిళల జాబితాను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసి ఉంచింది. సిరిసిల్లలోని ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్డర్లు ఇచ్చి 17 డిజైన్లు.. 17 రంగులు కలిపి 289 వెరైటీలతో అతివలను ఆకట్టుకునే రీతిలో చీరెలను నేయించింది. నేడో, రేపో జిల్లా కేంద్రాలకు చీరలు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల పరిధిలో 9 లక్షల మందికి పైగా అతివలకు చీరెలను పంపిణీ చేయనున్నారు.
తొమ్మిది రోజులపాటు సందడి వాతావరణంలో జరిగే తీరొక్క పూల పండుగను అతివలు ఆనందంగా నిర్వహించుకునేలా యేటా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతీ ఆడబిడ్డను తోబుట్టువుగా గౌరవిస్తూ సారెగా చీరను అందించాలని సంకల్పించిన సీఎం కేసీఆర్, యేటా దసరాకు ముందుగానే చీరెలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,26,859 ఆహార భద్రతా కార్డులు ఉండగా.. 18 ఏండ్లు నిండిన వారు 9 లక్షల మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు అర్హులైన వారి జాబితాను మండలాల వారీగా గుర్తించారు. సిరిసిల్లలో తయారీ పూర్తయిన చీరెలను టెస్కో సేకరిస్తుండగా.. ఒకటి, రెండు రోజుల్లో జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో చీరలను భద్రపర్చనున్నారు. కాగా, మొదటి విడుతగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చీరెలు చేరుకున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, చేనేత జౌళీ శాఖలు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, గ్రామ స్థాయిలో పలు శాఖల సిబ్బంది సహకారంతో ఈ చీరలను పకడ్బందీగా పంపిణీ చేసేలా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెలలో రేషన్ దుకాణాల ద్వారా చీరెలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
18 ఏండ్లు నిండిన మహిళల జాబితాను పౌర సరఫరాల శాఖ పంపించింది. ఈ ప్రకారంగా ప్రభుత్వం చీరెలను జిల్లాకు పంపనున్నది. జిల్లాకు పూర్తిస్థాయిలో వచ్చాక రేషన్ దుకాణాల ద్వారా చీరెలను పంపిణీ చేయనున్నాం. అన్ని శాఖల సమన్వయంతో పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం.
– విజయలక్ష్మి, డీఆర్డీవో, నిర్మల్