ఎదులాపురం, ఆగస్టు 26: జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించడానికి వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రిమ్స్ దవాఖానను స్థానిక సంస్థల కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రిమ్స్‌లోని ఎన్ఆర్సీ, చిన్న పిల్లలు, ఐసీయూ, ఆర్థోపెడిక్ వార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వానాకాలం సీజన్లో పిల్లల వార్డులో రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా అత్యవసరంగా మరో వార్డును ఏర్పాటు చేయాలని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌కు సూచించారు. రోగులకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు అత్యవసర వైద్య సేవలందించేందుకు నిరంతరం డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వైరల్ జ్వరాల వ్యాప్తి దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. రానున్న మూడు నెలల వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక్కడ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, దవాఖాన సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
భీంపూర్,ఆగస్టు 26: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఒక ఏఎన్ఎంను కేటాయించామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి భీంపూర్ పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. లేబర్ రూం, ప్రసూతి వార్డు , స్టోర్ గదులను పరిశీలించారు. బేల్సరిరాంపూర్కు చెందిన బాలింత మెస్రం సమితకు కేసీఆర్ కిట్ అందజేశారు. అనంతరం వైద్యసిబ్బందితో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రసవ సమయానికి కొన్ని రోజులు ముందుగానే గర్భిణులను పీహెచ్సీ లేదా రిమ్స్‌కు తరలించాలని ఆదేశించారు. భీంపూర్ పీహెచ్సీలో సగటున నెలకు 20 సురక్షిత ప్రసవాలు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. రోగుల వద్ద తీసుకున్న శాంపిళ్లను టీహబ్‌కు పంపించి ఆ మేరకు వైద్య సేవలందించాలని సూచించారు.
కొవిడ్ ప్రికాషన్ డోస్‌ను ఉపకేంద్రాలవారీగా అర్హులైన వారందరికీ అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక్కడ మండల ప్రత్యేకాధికారి గోపీకిషన్, వైద్యాధికారి విజయసారథి, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, హెచ్‌ఈవో జ్ఞానేశ్వర్, సర్పంచ్ మడావి లింబాజీ, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మార్శెట్టి అనిల్, నాయకులు ఉత్తం రాథోడ్, కుడిమెత సంతోష్, పాండురంగ్, పురుషోత్తం, సిబ్బంది ఉన్నారు.