పెంబి, ఆగస్టు 26: పీహెచ్సీలో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. పీహెచ్‌లో ప్రసూతి గది, ల్యాబ్, మెడికల్ స్టోర్, జనరల్ వార్డును పరిశీలించారు. రోగులతో మాట్లాడి పీహెచ్‌లో సమస్యలను తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంలేదని, రాత్రి వేళల్లో దవాఖాన మూసి ఉంటుందని రోగులు పీవోకు ఫిర్యాదు చేశారు. స్టాఫ్ నర్స్, కంటి వైద్యుడు తప్ప మెడికల్ ఆఫీసర్, సిబ్బంది లేకపోవడంతో పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ పీహెచ్సీలో డెలివరీ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
నెలకు 4 నుంచి 5 డెలివరీలు మాత్రమే కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నెలా కనీసం 15 డెలివరీలు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్యం అందించాలని తెలిపారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదులను పరిశీలించారు.
పాఠశాల చుట్టూ చెత్త పేరుకుపోయి ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను తొలగించాలని సర్పంచ్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లింబాద్రి, తహసీల్దార్ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్లా నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్ పూర్ణచందర్ పాల్గొన్నారు.