బోథ్, ఆగస్టు 26 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బసవన్నలను అందంగా ముస్తాబు చేశారు. డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. నైవేద్యం సమర్పించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. బోథ్, సొనాల, కౌఠ(బీ), ధన్నూర్ (బీ), పొచ్చెర, కుచులాపూర్, కన్గుట్ట, మర్లపెల్లి, పట్నాపూర్ గ్రామాల్లో రైతులు ఎద్దులను శుభ్రంగా కడిగి అలంకరణ చేశారు. ఊరేగింపుగా తీసుకెళ్లి హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం ఇళ్లకు తీసుకెళ్లి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. కైలాస్టేకిడి గ్రామంలో సంత్ శ్రీ లింబాజీ మహారాజ్ మహానందికి ప్రత్యేక పూజలు చేశారు. మహాదేవుని ఆలయం చుట్టూ ఎద్దులచే ప్రదక్షిణలు చేయించారు.
ఇచ్చోడ, ఆగస్టు 26 : మండలంలోని కోకస్మన్నూర్, గేర్జం, జామిడి, జల్థా, మల్యాల, తలమద్రి, ముక్రా(బీ), నవేగావ్, బోరిగామ, కామగిరి, జున్ని, ఇచ్చోడ, అడెగామ(కే) గ్రామాల్లో రైతులు ఎద్దులను వాగులు, చెరువులకు తీసుకెళ్లి స్నానాలు చేయించారు. కొమ్ములకు రంగులు వేసి అలంకరించారు. సాయంత్రం గ్రామాల్లో ఊరేగింపుగా ఎద్దులను తీసుకెళ్లి హనుమాన్ ఆలయాల చుట్టూ తిప్పి, అనంతరం ఇండ్లకు తీసుకువచ్చి నైవేద్యాలు తినిపించారు.
భీంపూర్, ఆగస్టు 26 : మండలంలోని పిప్పల్కోటి, కరంజి(టీ), అర్లి(టీ), నిపాని, అంతర్గాం, గోముత్రి, గుబ్డి గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. తమ ఎద్దులను అలంకరించి పూజలు చేసి నైవేద్యం తినిపించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఎస్ఐ రాధిక సిబ్బందితో పెట్రోలింగ్ చేశారు.
సిరికొండ/నార్నూర్/ నేరడిగొండ/ బజార్హత్నూర్/ తలమడుగు, ఆగస్టు 26 : బసవన్నలను ప్రత్యేక పండుగగా భావించే పొలాల అమావాస్యను సిరికొండ, నార్నూర్, గాదిగూడ, నేరడిగొండ, బజార్హత్నూర్, తలమడుగు మండలాల్లో రైతులు ఘనంగా జరుపుకున్నారు. కొమ్ములకు కాగితాలు, వీపుపై జూలు, మెడలో గంటలతో ఎంతో అందంగా ఎద్దులను అలంకరించారు. బసవన్నలకు గృహాల్లో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో సిరికొండ, ధర్మసాగర్ సర్పంచ్లు నర్మదా, లక్ష్మి, మాజీ సర్పంచ్లు బిక్కు, పెంటన్న, గ్రామపటేళ్లు పాల్గొన్నారు.
బేల, ఆగస్టు 26 : మండలంలోని మణియార్పూర్ గ్రామంలో ఎంపీపీ వనితాఠాక్రే కుటుంబ సభ్యులు ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, నాయకులు గంభీర్ఠాక్రే, సతీశ్ పవార్, దేవన్న, గ్రామాల సర్పంచ్లు , ఎంపీటీసీలు రైతులు పాల్గొన్నారు.
జైనథ్, ఆగస్టు 26: పొలాల అమావాస్య పండుగను పురస్కరించుకొని మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న- రమ దంపతులు బసవన్నలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ పెద్దలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆయన వెంట నాయకులు దుర్గం శేఖర్, విజ్జగిరి నారాయణ ఉన్నారు. జైనథ్లో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు.
తాంసి, ఆగస్టు 26: మండలంలోని కప్పర్ల, తాంసి, బండలనాగాపూర్, గిరిగాం, పొన్నారి, జామిడి, వడ్డాడి, ఘోట్కూరి, సవర్గం, అంబుగాం గ్రామాల్లో రైతులు పొలాల అమావాస్య పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఎద్దులను వాగుల్లో శుభ్రంగా కడిగి ప్రత్యేకంగా అలంకరించి గ్రామదేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. తమ పాడిపంటలు బాగుండాలని బసవన్నలకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. బండలనాగాపూర్లో నిర్వహించిన పొలాల అమావాస్య పండుగలో జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 26 : ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో పొలాల అమావాస్యతో పండుగ వాతావరణం నెలకొందని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండలంలోని సమక గ్రామానికి ఆయన రాగా గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామపటేల్ పెందూర్ భగవంత్రావ్తో ఐటీడీఏ పీవో కలిసి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎద్దులకు నైవేద్యాలు తినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ సోయం రంబాబాయి, మహారాజ్ యశ్వంత్రావ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో రైతులు పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు.